గోదావరి నది మధ్య యన్టీఆర్ విగ్రహం?
posted on Mar 10, 2015 9:54PM
తాజా సమాచారం ప్రకారం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాజమండ్రి వద్ద గోదావరి నది మధ్యలో మాజీ ముఖ్యమంత్రి మరియు తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి భారీ విగ్రహం స్థాపించబోతోంది. ఈ విగ్రహాన్ని గోదావరి పుష్కరాల సమయంలోనే ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగిన సన్నాహాలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ భారీ విగ్రహాన్ని యన్.డి. తేజ అనే శిల్పి పశ్చిమ గోదావరి జిల్లాలో తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదివరకు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ మధ్యలో గల జీబ్రాల్టార్ రాక్ మీద భారీ విగ్రహం స్థాపించారు. ఇప్పుడు ప్రతిష్టించబోయే యన్టీఆర్ విగ్రహం కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది, అక్కడిలాగే గోదావరి నదిలో కూడా విగ్రహం ప్రతిష్టించిన చోట ఒక మంచి పార్క్ నిర్మించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానది మధ్యలో త్వరలో నిర్మించబోయే రాజధాని నగరానికి అభిముఖంగా ఈ విగ్రహం ప్రతిష్టించాలని భావించినట్లు వార్తలు వచ్చేయి. స్వర్గీయ యన్టీఆర్ కి కృష్ణా జిల్లాకి అవినాబావ సంబంధం ఉంది కనుక అక్కడే ఆయన విగ్రహం ప్రతిష్టిస్తారని అందరూ భావిస్తుంటే అకస్మాత్తుగా ఈ వార్త వెలువడింది. కానీ దీనిని అధికారికంగా ఎవరూ దృవీకరించలేదు.