నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేష్ విడుదల

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నోటిఫికేష్ వెలువడింది. సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నాలుగో దశలో  ఆంధ్రప్రదేశ్,   ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ  స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

తెలంగాణ, ఏపీతో పాటు ఆయా రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి గురువారం (ఏప్రిల్ 18) నోటిఫికేషన్ వెలువడింది.   దీంతో ఆయా రాష్ట్రాలలో గురువారం (ఏప్రిల్ 18) నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ నెల 25. కాగా 26న నామినేషన్ల పరిశీల ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఈ నెల 29.  మే 13న పోలింగ్. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల ఉంటాయి. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఏపీలో ఎన్నికల హీట్ తారస్థాయికి చేరింది. ఇప్పుడు ఇక నోటిఫికేషన్ కూడా విడుదల కానుండటంతో ప్రచారం మరింత జోరందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి ప్రచారం హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా జోరుగా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు.