రద్దు ఎఫెక్ట్: డిసెంబర్‌లో శ్రీవారి ఆదాయం రూ. 85 కోట్లు

దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు నల్లధనానికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్రమోడీ..ఆ నిర్ణయం నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. కుప్పలు కుప్పలు పోగుపడిన డబ్బును ఏం చేయాలో..ఎలా మార్చుకోవాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఆ గందరగోళంలో వారికి కనిపించిన మార్గం దేవుడి హుండీ..దీంతో కోట్ల రూపాయల డబ్బు హుండీల్లో జమ అయ్యింది.

 

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి హుండీలు మామూలు రోజుల్లోనే నిండిపోతాయి..అలాంటిది పెద్ద నోట్ల రద్దుతో కోట్లకు కోట్లకు వచ్చిపడ్డాయి. తాజాగా టీటీడీ ఈవో సాంబశివరావు విడుదల చేసిన ప్రకటనలో ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.85 కోట్ల ఆదాయం వచ్చిందట. ఏడాది మొత్తం హుండి ద్వారా వచ్చిన ఆదాయం 1,018 కోట్లు కాగా, శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 2 కోట్ల 66 లక్షలు..గత రెండు నెలల్లో హుండీల్లో పడ్డ పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకుంటే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఈవో తెలిపారు. గడువు ముగియడంతో నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించాలని రిజర్వ్ బ్యాంకుకు లేఖ రాశామని..సమాధానం వచ్చిన తక్షణం పాత నోట్లను జమ చేస్తామని వెల్లడించారు.