పదవులు కాదు.. రాష్ట్ర అభివృద్ధికి నిధులు బాబు లక్ష్యం!

జగన్ ఐదేళ్ల పాలనలో  ఆర్థికంగా దివాళా అంచుకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టి అభృవృద్ధి, సంక్షేమంలో అగ్రస్థానానికి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన చంద్రబాబు.. ఆ దిశగా వేగం పెంచారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి సైతం అదే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. మంత్రి పదవులు, హోదాల కంటే తాము కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులనే ఆశిస్తున్నామని చెప్పారు. లోక్ సభ స్పీకర్ ఎన్నిక బుధవారం (జూన్ 26) జరిగింది. ఓం ప్రకాష్ బిర్లానే స్పీకర్ గా ఎన్నికయ్యారు. అయితే లోక్ సభ స్పీకర్ పదవి కోసం తెలుగుదేశం రేసులో ఉందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఎన్నికకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుతో ఫోన్ లో సంభాషించారు.

ఈ సందర్భంగా ఆయన లోక్ సభ స్పీకర్ ఎన్నికపై చంద్రబాబుకు వివరించడమే కాకుండా, ఆయన అభిప్రాయం కూడా కోరారు. దీంతో చంద్రబాబు అమిత్ షాకు తమకు కావలసింది పదవులు కాదనీ, రాష్ట్ర అభివృద్ధి కోసం పుష్కలంగా నిధులు అని స్పష్టం చేశారు. అంతకు ముందు పార్లమెంట్ సమావేశాలలో తెలుగుదేశం సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు ఎంపీలకు వివరించారు. రాష్ట్రం ఆర్ధికంగా చాలా కష్టాల్లో ఉందన్నారు. రాష్ట్రంలో పాలన సాఫీగా సాగాలంటే ముందు ఆర్ధిక పరిపుష్ఠి సాధించాలని చంద్రబాబు ఎంపీలకు తెలిపారు.  ప్రజలకు ఇచ్చిన హామీలు  అమలు చేయాలంటే నిధులు కావాలని అందుకు ప్రతి ప్రజా ప్రతినిధి తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుందని చెప్పడమే కాకుండా,   ప్రతి ఎంపీకి మూడు శాఖలు కేటాయిస్తామనీ, ఆయా శాఖల ప్రగతికి నిధుల సమీకరణతో పాటు ప్రణాళికలు సూచించాల్సిన బాధ్యత, ఆ ప్రణాళిక మేరకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాల్సిన బాధ్యత కూడా ఎంపీలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఇలా ఉండగా చంద్రబాబు రాష్ట్రానికి నిథులు కావాలన్న వినతిపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సంరద్భంగా ఇప్పటికే నంబూరు -అమరావతి్ర ఎర్రుపాలెం రైల్వే లైన్ మంజూరు చేస్తూ ప్రకటన వెలువడిన సంగతిని హోంమంత్రి గుర్తు చేశారు.