చికిత్స పేరుతో జయను చంపేశారా? సెన్సేషనల్ ఆడియోల లీక్
posted on Oct 20, 2022 5:06PM
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనక మిస్టరీ ఉందనడానికి ఒకదాని తరువాత ఒకటిగా ఆధారాలు బయటపడుతున్నాయి. అనారోగ్యానికి గురైన జయలలితను ఆసుపత్రిలో చేర్పించి ఆక్కడ ఆమెకు సరైన చికిత్స అందకుండా చేశారనీ, చివరకు మరణించే వరకూ ఆమెను ఆసుపత్రిలోనే బందీగా ఉంచారనీ అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఆమె మృతి వెనుక ఏదైనా మిస్టరీ ఉన్నదా అన్న విషయాన్ని తేల్చడానికి నియమించిన కమిషన్ ఇటీవలే తన నివేదికను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు అందజేసింది. ఆ కమిషన్ నివేదిక కూడా జయలలిత మరణం వెనుక మిస్టరీ ఉందనీ.. దానిని ఛేదించేందుకు దర్యాప్తు అవసరమనీ పేర్కొంది. తాజాగా లీక్ అయిన రెండు ఆడియో క్లిప్పింగులు కూడా జయలలిత మరణానికి కేవలం అనారోగ్యం ఒక్కటే కారణం కాదన్న అనుమానాలను బలపరుస్తున్నాయి.
ఆసుపత్రిలో ఆమెకు సరైన చికిత్స అందడం లేదని స్వయంగా జయలలిత అక్కడి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆడియో ఒకటి ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నది. సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్ అవుతున్నాది. జయలలిత ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న సమయంలో మాట్లాడినట్లుగా చెప్తున్న కొన్ని మాటలు లీక్ కావడం సంచలనం రేపుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడు మాజీ సీఎం జయలలిత తన గదిలో ఉన్న డాక్టర్లపై అసహనం వ్యక్తం చేయడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నది.
తాను పిలిస్తే ఎందుకు రావడం లేదని డాక్టర్లపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఆమె దగ్గుతూ ఉండటం, అలాగే ఆమె గొంతు చాలా బలహీనంగా ఉండటం ఆ ఆడీయోలో స్పష్టంగా తెలుస్తోంది. తాను బాధపడుతున్నా పట్టించుకోవడం లేదంటూ జయలలిత అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలు వినిపిస్తున్నాయి.
అలాగే మరో ఆడియోలో జయలలితను విదేశాలకు పంపి చికిత్స అందించడం అంత అవసరమా అంటూ జయలలిత సన్నిహితురాలు శశికళ అంటుండటం స్పష్టంగా వినిపిస్తోంది. 2017లో జయలలిత చికిత్సకు సంబంధించి వివరాలు అందించేందుకు లండన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్ బేలే ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా మీట్ తరువాత అనంతరం ఆయన అక్కడే ఉన్న శికళతో మాట్లాడిన సంభాషణకు సంబంధించిన ఆడియోలో డాక్టర్ బేలే జయలలిత అప్పటి ఆరోగ్య పరిస్థితిపై వివరిస్తుంటే.
శశికళ జయలలితను విదేశాలకు పంపడం అవసరమా అని ప్రశ్నించడం, ఆమె ప్రశ్నకు డాక్టర్ బేలే జయలలితను చికిత్స కోసం విదేశాలకు పంపాల్సిందే అని, ఇందుకు జయలలిత కూడా అంగీకరించారని చెప్పడం స్పష్టంగా వినిపిస్తోంది. ఈ రెండు వీడియోలనూ కూడా ఆ సమయంలో అక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బంది ఎవరో రికార్డు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ రెండు వీడియోలు ఇప్పుడు తమిళనాటసంచలనం సృష్టిస్తున్నాయి.