విపక్షాల ఐక్య కూటమి సారథి నితీష్?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. దేశ  రాజకీయాలలో ఆయనదొక విలక్షణ శైలి. కూటములు, పొత్తులతో అధికారాన్ని పదిలంగా కాపాడుకోవడమెలాగో కచ్చితంగా తెలిసిన నేత.  బీజేపీతో జట్టు కట్టినా, కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి మహాఘట్ బంధన్ ఏర్పాటు చేసినా బీహార్ సీఎంగా తన పదవిని పదిలం చేసుకోవడానికేనని ఆయన వ్యతిరేకులు విమర్శిస్తుంటారు. ఎలా అయినా సరే అధికారానికి నిచ్చెనలు వేసి ఎక్కడంలో, అందుకు అనుగుణంగావ్యూహాలు రచించడం, ఎత్తులు వేడయంలో దిట్ట. 
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రాజకీయ వ్యూహాలు కూడా ప్రత్యర్థులను తేరుకోలేని విధంగా ఇరుకున పెడతాయి.

ఇద్దరిలో ఉన్న తేడా ఏమిటంటే.. కేసీఆర్ మాటల మాంత్రికుడు అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ మాటలలో కాదు చేతలలో చూపిస్తాననే రకం. ఈ ఇద్దరూ కూడా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ను గద్దె దించాలన్న వ్యూహంతోనే అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం కేసీఆర్ ఏకంగా తనకు రెండు సార్లు అధికార అందలాన్ని అందించిన తెలంగాణ సెంటిమెంటునే వదులు కున్నారు. తెరాస (ఇప్పుడు బీఆర్ఎస్) అధినేతగా ఆయన కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ అంటూ దేశమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఎవరూ కలిసి వచ్చేలా లేరని నిర్ధారణ చేసుకున్న తరువాత  ఆయన తెరాసను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలలోకి ఒక్కసారిగా జంప్ చేసేశారు. ఇంత వరకూ బాగానే ఉంది. ఆ తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాల అడుగులు నెమ్మదించాయి.

లేట్ గా అడుగుపెట్టినా లేటెస్ట్  అన్నట్లుగా నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం తన ప్రయత్నాలను ప్రారంభించారు. కాంగ్రెస్ తో టచ్ లో ఉంటూనే బీజేపీయేతర పార్టీలతో పాటుగా కాంగ్రెస్సేతర పార్టీలను కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు నితీష్ చేస్తున్న ప్రయత్నాలకు సానుకూలత వ్యక్తం అవుతోంది.   ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ,  ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో చర్చలు జరిపిన నితీష్ కుమార్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీకి సిద్ధమౌతున్నారు.

వాస్తవానికి బీజేపీ వ్యతిరేక పొలిటికల్ ఫైట్‌ను తొలుత తెరపైకి తీసుకొచ్చిన  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ ప్రయత్నాలలో అడుగు ముందుకు వెయ్యడంలో ఫెయిల్ అయ్యారు.. కానీ నితీష్ కుమార్ మాత్రం ఒక ప్రణాళికతో అదే ప్రయత్నంతో అడుగులు  ముందుకు వేస్తున్నారు.   కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కింగ్ మేకర్ రోల్ కోసం కాకుండా ఏకంగా కింగ్ ను అవదామన్నదే తన లక్ష్యం అంటూ బాహాటంగా తెలిసేలా వ్యవహరించి.. జాతీయ పార్టీలను దూరం చేసుకున్నారు. అయితే నితీష్ మాత్రం వ్యూహాత్మకంగా.. బీజేపీని గద్దె దించడమే లక్ష్యం అనడమే  కాకుండా.. తాను పీఎం రేసులో లేనని ప్రకటించారు. దీంతో ఆయన అటు బీజేపీ యేతర పార్టీలనే కాకుండా, బీజేపీయేతర, కాంగ్రెస్సేతర పార్టీలను కూడా రీచ్ కాగలిగారు. జాతీయ రాజకీయాలలో బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావడానికి ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ రెడీగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ ను తమ కూటమి సారథిగా అంగీకరించేందుకు వాటికున్న అభ్యంతరాలు వాటికి ఉన్నాయి.  

నితీష్ ఆ అభ్యంతరాలను అడ్రస్ చేయగలిగారు.  అందుకే జాతీయ రాజకీయాలలో యాక్టివ్ రోల్ ప్లే చేయగలుగుతున్నారు. మోడీ సర్కార్ ను గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడమే కాక.. ఆ కూటమిలోకి కాంగ్రెస్ ను వ్యతిరేకించే పార్టీలను కూడా కలుపుకుపోయే విధంగా నితీష్ వేస్తున్న అడుగులు ముందు ముందు బీజేపీ వ్యతిరేక కూటమి సారథిగా ఆయనే ఎంపికయ్యే అవకాశాన్ని కల్పిస్తాయని, అదే జరిగితే బీజేపీయేతర కూటమి ప్రధాని అభ్యర్థిగా ఆయన తెరమీదకు వచ్చే అవకాశాలనూ కొట్టిపారేయలేమనీ పరిశీలకులు అంటున్నారు.