రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చర్యలు మొదలుపెట్టిందిట!

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లో రాష్ట్రానికి చాలా హామీలు ఇవ్వబడ్డాయి. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకు వాటిలో ఒక్క హామీపై కూడా అడుగు ముందుకు పడలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో బాటు విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలనీ ఖచ్చితంగా నెరవేరుస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చాలాసార్లు చెప్పారు. కానీ ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇవ్వనేలేదు.

 

ప్రస్తుతం వైజాగులో పర్యటిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, వీటన్నిటిపై కొంత స్పష్టత ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ వైజాగు నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిదారు ఏర్పాటుకు, కాకినాడలో హార్డ్ వేర్ పార్క్, చిత్తూరులో ఉద్యానవన కేంద్రం, విశాఖలో ఐటీ హబ్ ల ఏర్పాటుకు కేంద్రం అవసరమయిన ప్రక్రియలు మొదలుపెట్టిందని, త్వరలోనే ఒక్కొకటిగా అవ్వన్నీ అమలుచేయడం మొదలుపెడతామని తెలిపారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం గురించి ప్రస్తావిస్తూ, ప్లానింగ్ కమీషన్లో అందుకోసమే ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసామని, ఆ కమిటీ ఆంద్రకు చెందిన తెదేపా, బీజేపీ యంపీలతో ఈ నెల25న సమావేశం కాబోతోందని తెలిపారు. ఆ సమావేశంలో వెనుకబడిన ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలకు అవసరమయిన ప్యాకేజీలు, పరిశ్రమల గురించి చర్చిస్తారని ఆమె తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో ఆ రెండు ప్రాంతాలకు ప్రత్యేక హోదా కేటాయించే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

 

ఇక రాజమండ్రీలో ఆహార సంబందిత పరిశ్రమలు నెలకొల్పేందుకు, తను ఆహారశాఖా మంత్రిని పర్యటనకు ఆహ్వానించానని, త్వరలోనే ఆమె పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని, ఆమె పర్యటించిన తరువాత రాజమండ్రీ చుట్టుపక్కల అనేక ఆహార సంబందిత పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. రాష్ట్రాన్ని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే తనకు కూడా చాలా బాధ కలుగుతోందని ఆంధ్రప్రదేశ్ కోడలిగా, రాజ్యసభ సభ్యురాలిగా తను రాష్ట్రానికి చేయగలిగినంతా సహాయం చేస్తానని ఆమె అన్నారు. కేంద్రమంత్రులు ఎన్ని హామీలు ఇస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం, యంపీలు, కేంద్రమంత్రులు కూడా కేంద్రంపై హామీల అమలుకు ఒత్తిడి తేగలిగితే హామీల ఆచరణకు కేంద్రం కూడా ఆసక్తి చూపుతుంది.