స్పీడ్ న్యూస్- 2

21.తనపై, తన కుటుంబ సభ్యులపై అసత్యాలను ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ యువనేత నారా లోకేశ్ న్యాయపోరాటం చేస్తున్నారు.దీనికి సంబంధించి ఆయన శుక్రవారం మంగళగిరి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చారు. 

22. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనంతపురంలో ఏర్పాటు చేసిన కియా కార్ల ఫ్యాక్టరీ 1 మిలియన్ కార్లను తయారు చేసి కీలక మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా కియా యాజమాన్యానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. 

23.తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ అయ్యారు. రాజాసింగ్ పై బీజేపీ పార్టీ విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, పార్టీతో ఆయనకు సంబంధం లేకుండా పోయింది. 

24. మచిలీపట్నంలో  మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరద చేరింది. ఆ వరదలో పాలప్యాకెట్లు కొట్టుకు రావడంతో మొదట ఆశ్చర్య పోయిన జనం.. తేరుకుని వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు.

25.బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్ షాపులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి.  సీపీ ఆదేశాల ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల వరకు మూతపడనున్నాయి.  


26.  విశాఖ నోట్ల మార్పిడి వ్యవహారంలో సస్పెండ్ అయిన రిజర్వు సీఐ స్వర్ణలతను పోలీసులు  కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంగార్డు, రిజర్వు కానిస్టేబుల్‌ను కూడా కస్టడీకి తీసుకుని విచారించారు. 

27.మన ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతుల మీదుగా ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్’ను అందుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం  మోదీ గురువారం పారిస్ చేరుకున్న సంగతి విదితమే. 

28. ఏవీయిన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు సాధారణంగా పక్షులను టార్గెట్ చేస్తాయి. అయితే, ఇటీవల కాలంలో క్షీరదాల్లోనూ బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూస్తున్నాయి.  ఈ వైరస్‌లో మార్పులు జరిగి మనుషుల్లో వ్యాపించే సామర్థ్యం సంతరించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

29. ఆగ్నేయ ఐరోపా దేశమైన  కొసావో ప్రధాని అల్బిన్ కుర్తీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యుడు లేచొచ్చి వాటర్ బాటిల్‌తో ఆయన ముఖంపై నీళ్లు చల్లారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుర్తీ విధానాలు పాశ్చాత్య మిత్రులతో సంబంధాలు దెబ్బతీసేలా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 

30.వెస్టిండీస్‌తో రోసోలోని విండ్‌సోర్ పార్కులో జరిగిన తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 215 బంతుల్లో సెంచరీ సాధించిన యశస్వి అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించిన 17వ భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

31.ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3 లో హైదరాబాదీ కంపెనీలకు కూడా భాగస్వామ్యం ఉంది. ఈ మిషన్ లో భాగంగా రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ లను జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ తీసుకెళుతోంది. 

32.రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబు తన కాన్వాయ్ లోని డాక్టర్ తో చికిత్స చేయించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న చంద్రబాబు ప్రమాదానికి గురైన మహిళలను గమనించి  చికిత్స చేయించారు.

33.ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఓ హీరోతో ఆమె సన్నిహితంగా కనిపించడంతో రెండో పెళ్లి అంశం తెరపైకి వచ్చింది.

34.హాలీవుడ్ సినీ కళాకారులు, ప్రముఖ నటులు సమ్మె బాట పట్టారు. దాదాపు 1.6 లక్షల మంది సినీ కళాకారులు సభ్యులుగా ఉన్న స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ నేతృత్వంలో ఈ సమ్మె జరుగుతోంది.

35.నటిగా తాను క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని ప్రముఖ నటి, గాయని సుచిత్రా కృష్ణమూర్తి అన్నారు. గతంలో ఓ దర్శకుడు తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని, దీంతో తాను ఏడ్చేశానని చెప్పారు. 

36.వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కొడుకు రాజారెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు.  రాజారెడ్డిని సినిమాల్లో లాంచ్ చేసే పనుల్లో షర్మిల ఉన్నారనే వార్త వైరల్ అవుతోంది. రాజారెడ్డి నటించబోయే చిత్రానికి పూరి జగన్నాథ్  చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. 

37. మన దేశంలో విజయవంతమైన తక్షణ చెల్లింపుల విధానం యూపీఐ సేవలను ఫ్రాన్స్‌ లో కూడా వినియోగించుకునే అవకాశం లభించనుంది. ఇకపై భారతీయ కరెన్సీలో తమ మొబైల్ అప్లికేషన్‌ ద్వారా ఫ్రాన్స్‌ లో చెల్లింపులు జరపడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.

38.జపాన్‌ పై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు.  రంగారెడ్డి జిల్లా చందన్ వెల్లిలో డైఫకు ఇంట్రా లాజిస్టిక్స్, నికోమక్ తైకిష కంపెనీలకు మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా జపాన్‌ సత్తా చాటిందన్నారు. 

39.దోశలో సాంబర్ లేదని ఆరోపిస్తూ ఓ లాయర్ వినియోగదారుల కోర్టులో కేసు వేసి  మూల్యం చెల్లించుకునేలా చేశారు. బీహార్‌కు చెందిన మనీష్ పాఠక్ అనే న్యాయవాది తనను రెస్టారెంట్ మోసం చేసిందని కేసు వేసి 3, 500 రూపాయల జరిమానా చెల్లించే విధంగా న్యాయపోరాటం చేశారు. 

40. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 341 డిమాండ్లను పరిష్కరించినట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో  స్పష్టం చేశారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ సహా వివిధ శాఖ అధికారులు భేటీ అయ్యారు.

41. పబ్ జీ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ప్రేమించి.. అతనినే పెళ్లి చేసుకోవడానికి సరిహద్దు దాటి భారత్ వచ్చిన పాక్ జాతీయురాలు సీమా గులాం హైదర్ ను తిరిగి తమ దేశానికి పంపించాలని ముంబై పోలీసులకు  బెదిరింపు కాల్ వచ్చింది. ఇది ఫేక్ బెదిరింపుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

42.తన నియోజకవర్గంలో హాస్పిటల్ అభివృద్ధి కోసమే హరీశ్ రావును కలిశానని  గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టత నిచ్చారు.  తాను బీజేపీలోనే ఉంటానని తనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. 

43.జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.పవన్ కళ్యాణ్ ‘మల్టీఫుల్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యాధితో " బాధపడుతున్నారని అన్నారు. 

44. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుల పేరిట తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ శుక్రవారం తెలిపారు.  తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులకు శ్రవణ్ ట్వీట్ చేశారు. .

45. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగప్రవేశానికి వేదికను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా ముట్లూరులో పర్యటించిన రాయుడు స్థానిక సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలకు రూ.5 లక్షల సాయం అందించారు.

46.వైసీపీకి, ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశం తనకు రాలేదని పంచకర్ల అనడం అబద్ధమని .రాజీనామా తొందరపాటు చర్య అని చెప్పారు.

47.తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స తెలంగాణను కించపరిచేలా మాట్లాడారని, తక్షణమే తన వ్యాఖ్యలను  వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

48. భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరో మెట్టు ఎక్కించే చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-3 పరికరాలను మోసుకుంటూ ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ పైకి లేచింది.

49. హైదరాబాద్ లోని  దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం విషాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పైనుంచి చెరువులో దూకి పదిహేడేళ్ల బాలిక పాయల్ ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదనే కారణంతోనే ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.పాయల్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఎన్ డీఆర్ఎఫ్ టీమ్ తో గాలింపు చర్యలు చేపట్టారు.

50.హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఓ మహిళా నిర్మాతకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె జాగింగ్ చేస్తోన్న సమయంలో ఓ వ్యక్తి ఫోన్ తో వీడియోలు తీస్తూ, అశ్లీల హావభావాలతో వేధించాడు. అతని వేధింపులను భరించలేని సదరు మహిళా నిర్మాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu