షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం కన్ఫర్మ్?

మాజీ సీఎం వైఎస్సార్ కుమార్తె, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను తమతో కలుపుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నదని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ విలీనంపై ఆ మధ్య  భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అప్పుడెప్పుడో షర్మిల పార్టీ విలీనంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాయబారం నడుపుతున్నట్లు చెప్పుకున్నారు. షర్మిల తన పార్టీని విలీనం చేస్తే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారనీ ప్రచారం జరిగింది. కానీ ఎందుకో అది ప్రచారంగానే మిగిలిపోయింది. ఈ మధ్యనే జులై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున సోనియా, రాహుల్ గాంధీలు కడప జిల్లాలోని ఇడుపులపాయకు వస్తారని.. అక్కడే వారు విజయమ్మ, షర్మిలతో భేటీ కానున్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరిగింది. అయితే, అది కూడా వర్క్ అవుట్ కాలేదు.

కాగా, ఇప్పుడు  సోనియాతో షర్మిల భేటీ కావడం ఖాయం అయ్యిందని చెబుతున్నారు. అదెప్పుడంటే..  ఈనెల 17,18 తేదీల్లో బీజేపీకి వ్యతిరేకంగా బెంగుళూరులో ప్రతిపక్షాలు సమావేశమవబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు రోజుల సమావేశంలో 24 పార్టీలు పాల్గొనబోతున్నట్లు ఇప్పటికే  ఖరారు కాగా  రానున్న రోజులలో ఈ సమావేశంలో పాల్గొనే  పార్టీల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.   కాగా, మొన్నటి పాట్నా సమావేశంలో 15 పార్టీలు పాల్గొనగా.. రాబోయే సమావేశానికి మరిన్ని పార్టీలను భాగస్వామ్యం చేసి గట్టి టీం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలోనే బెంగళూరు సమావేశాలకు దక్షణాదిన ప్రతిపక్షాలకు కాంగ్రెస్ తరపున ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ సమావేశం కోసం సోనియా, రాహుల్ బెంగళూరు వస్తుండగా.. ఈ సమావేశాలకు షర్మిలను కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. సమావేశాలతో పాటు 17 రాత్రి ప్రతిపక్షాల విందులో కూడా షర్మిల పాల్గొనబోతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

ఈ మధ్య వైఎస్సార్ జన్మదినం నాడు పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు ఖర్గే చేసిన ట్వీట్ల ద్వారా వైఎస్సార్ కు కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఉందనే సంకేతాలు ఇవ్వగా.. దానికి షర్మిల సానుకూలంగా స్పందించడం చూస్తుంటే  ఇప్పటికే వైఎస్సీర్టీపీ కాంగ్రెస్ లో విలీనం విషయంలో ఒక నిర్ణయం జరిగిపోయినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల తరపున కాంగ్రెస్ పెద్దలతో తెలంగాణ నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటు కర్ణాటక నుండి డీకే శివకుమార్ మాట్లాడుతుండగా.. బెంగళూరు భేటీతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందనిపిస్తున్నది. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపి విలీనం చేసేయాలని.. అందుకు ప్రతిఫలంగా ఆమెని రాజ్యసభకి పంపించడం.. కావాలంటే ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు కూడా ఆమెకి అప్పగించాలన్నది కాంగ్రెస్ ప్రతిపాదన కాగా.. కాంగ్రెస్ తో పొత్తుకి వస్తామని.. అది కూడా కేవలం తెలంగాణలోనే తన రాజకీయాలు ఉంటాయని షర్మిల చెబుతున్నట్లుగా  ఆయా పార్టీల వర్గాల ద్వారా తెలుస్తోంది. 

మరిఈ రెండు ఆప్షన్లలో ఏది ఫైనలైజ్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల పార్టీ  విలీనానికి  అంగీకరిస్తారా? ఒకవేళ షర్మిల ఒకే అంటే ఆమె ఏపీకి వెళ్తారా.. తెలంగాణలోనే ఉంటారా అన్నది ఈ భేటీలో తేలిపోతుందని చెబుతున్నారు. అదలా ఉంచితే,  కాంగ్రెస్ లోనే కొందరు నేతలు షర్మిలను పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. రేణుకా చౌదరి ఆ మధ్య షర్మిల ఎవరో తెలియదని.. ఆ తర్వాత  వైఎస్ కూతురా అంటూ కామెంట్ చేశారు. మరో ఎంపీ చింతామోహన్ సైతం భిన్న స్వరం వినిపించారు. మరో సీనియర్ నేత వీ హనుమంతరావు అయితే.. షర్మిలా లేదు గిర్మిలా లేదు.. ఆమెని వెళ్లి ఏపీలో రాజకీయం చేసుకోమనండి.. తెలంగాణలో ఆమెకి ఏం పని అంటూ తీవ్ర వ్యాఖ్యలు   చేసారు. ఈ నేపథ్యంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరిక విషయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా సర్వత్రా ఆసక్తి కూడా వ్యక్తమౌతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu