తెలంగాణపై ఆశలు వదిలేసుకున్న బీజేపీ?

మగధీర సినిమాలో విలన్ డైలాగ్ ఒకటి ఉంటుంది. నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని.. తెలంగాణ విషయంలో బీజేపీ వైఖరి కూడా కొంచం ఇంచు మించు అలాగే ఉంది. రాష్ట్రంలో తాను గెలిచే పరిస్థితి ఎలాగూ లేదని అర్ధమైన మరుక్షణం నుంచీ తెలంగాణలో కాంగ్రెస్ గెలవకుండా ఉంటే చాలన్న వైఖరి తీసుకుంది. ఇందు కోసం బీజేపీ అధిష్ఠానం రాష్ట్రం విషయంలో తీసుకునే ప్రతి నిర్ణయం బీఆర్ఎస్ కు అనుకూలంగా, ప్రయోజనం చేకూర్చేదిగా ఉండేలా జాగ్రత్త పడుతోంది.

పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చడం, అధ్యక్ష పగ్గాలను కిషన్ రెడ్డికి అప్పగించడం మొదలు కాంగ్రెస్ లోకి బీజేపీ నేతలే కాకుండా, బీఆర్ఎస్ నేతలు కూడా చేరకుండా ఉండేలా వ్యూహాలు రచించడం దగ్గర నుంచీ బీజేపీ కాంగ్రెస్ దూకుడును కట్టడి చేయడం అన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ లో చేరికలకు చెక్ పెట్టేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించింది.   బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరాలని భావిస్తున్న నాయకుల జాబితాను దగ్గరపెట్టుకుని.. వారిని తమ పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అలా రావడం ఇష్టం లేని వారిని బీఆర్ఎస్ వీడొద్దంటూ కౌన్సెలింగ్ ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ చెబుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే చేరితో బీజేపీలో చేరండి లేదంటే బీఆర్ఎస్ లోనే కొనసాగండి అంటూ ఆయా నాయకులకు బీజేపీ రాష్ట్ర నేతలు నచ్చచెబుతున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.   

కర్ణాటక ఫలితాల తరువాత  రాష్ట్రంలో కాంగ్రెస్ జోరు పెరిగింది. అదే సమయంలో బీజేపీలో అసమ్మతి, అసంతృప్తుల సంఖ్య పెరిగింది. ఇది కాంగ్రెస్‌కు మరింత కలిసొచ్చింది. దాంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పరిస్థితి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అన్న వాతావరణం ఏర్పడింది. బీజేపీ రాష్ట్ర నాయకులలో కొందరు ఈ పరిస్థితి గురించి బాహాటంగానే చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైనా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. దీంతో బీజేపీ క్యాడర్ లో నిరుత్సాహం తారస్థాయికి చేరింది. బీజేపీ కార్యక్రమాలలో ఉత్సాహం కొరవడింది.  అదే సమయంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అలా చూస్తున్న వారి జాబితాలో పెద్ద పెద్ద నాయకులే ఉన్నారన్న సమాచారం బీజేపీని కంగారు పెడుతోంది.  

అందుకే తనకు ఎలాగూ చాన్స్ లేదు.. కాంగ్రెస్ కు మాత్రం గెలుపు అవకాశాలు లేకుండా చేయడమే లక్ష్యం అన్నట్లుగా బీజేపీ హై కమాండ్ తీరు ఒక్కసారిగా మారిపోయింది.  కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ తెరవెనుక యత్నాలు ప్రారంభించడం కచ్చితంగా బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అన్న విశ్లేషకుల మాటలు అక్షర సత్యాలన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తమౌతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu