మురళీమోహన్‌కి వ్యతిరేకంగా జయభేరి ఎదుట ధర్నా!

ప్రముఖ నటుడు, నిర్మాత, జయభేరి సంస్థల అధినేత, మాజీ ఎంపీ మురళీమోహన్ చిక్కుల్లో పడ్డారు. తాడేపల్లి మండలం కుంచనపల్లి దగ్గర  నిర్మించిన జయభేరి ది క్యాపిటల్‌  అపార్ట్ మెంట్ వాసులు రోడ్డెక్కారు.  ఈ అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్స్‌ యజమానులు జయభేరి సంస్థ తమను మోసం చేసిందంటూ  వారు ధర్నాకు దిగారు. బుధవారం(సెప్టెంబర్ 18) న అపార్ట్ మెంట్ వాసులు బయట నుంచి ఎవరూ లోనికి రాకుండా కార్లు పార్క్ చేశారు. బిల్డర్ గా మురళీమోహన్ కు మంచి రికార్డే ఉంది.  హైదరాబాద్‌లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల్లో జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌ అనేక వెంచర్లు చేసింది. ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదులూ వచ్చిన దాఖలాలు లేవు. అయితే  ఇప్పుడు మాత్రం కుంచనపల్లి దగ్గర నిర్మించిన జయభేరి ది క్యాపిటల్‌పై ఫ్లాట్‌ యజమానులు బోలెడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. విషయాన్ని  యాజమాన్యం దృష్టికి  తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో ధర్నాకు దిగారు. 

విషయమేంటంటే జయభేరి ది క్యాపిటల్‌లో మొత్తం 147 ఫ్లాట్స్‌ ఉన్నాయి.  ఆ ప్లాట్స్ కొనుగోలు సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వసతులు కల్పించలేదంటూ జయభేరీ సంస్థపై అపార్ట్ మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మురళీమోహన్‌కి చెందినవి కావడంతో, అతనిపై నమ్మకంతోనే కొనుగోలు చేశామని యజమానులు చెబుతున్నారు.    సిసి కెమెరాలు ఫిక్స్‌ చేయలేదు, కార్‌ పార్కింగ్‌ దగ్గర దీపాలు లేవు. చెప్పిన మేరకు సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయకపోవడం,  ఫైర్‌ సేఫ్టీ లేకపోవడం, చుట్టు పక్కల నుంచి పాములు వంటి ప్రాణహాని కలిగించే జంతువులు రాకుండా జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి 90 ఫిర్యాదులను అపార్ట్ మెంట్ వాసులు సంస్థ యాజమాన్యానికి  ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో వారు ధర్నాకు దిగారు.   ఈ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్స్‌ కొనుగోలు చేసిన వారికి రక్షణ లేకుండా పోయిందని, ఏదైనా అగ్నిప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడతామన్న నమ్మకం తమకు లేదని యజమానులు చెబుతున్నారు. 

జయభేరి సంస్థకు, మురళీమోహన్‌కి మంచి పేరు ఉంది.  ఆ నమ్మకంతోనే  ఫ్లాట్స్‌ కొనుగోలు చేశామని, తమతోపాటు బంధువులచేత కూడా కొనిపించామని యజమానులు అంటున్నారు. ఫ్లాట్స్‌ అమ్మడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు తప్ప ఫ్లాట్స్‌లో ఉండేవారికి కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్స్‌ హ్యాండోవర్‌ చేసేందుకు 15 రోజుల నుంచి నెలరోజుల వరకు టైమ్‌ తీసుకుంటున్నారని అంటున్నారు. ఎమినిటీస్‌, కార్పస్‌ ఫండ్‌తోపాటు అగ్రిమెంట్‌లో పేర్కొన్న ప్రతి ఒక్క దానికి మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్‌కి ఎందుకు టైమ్‌ తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని వాపోతున్నారు. రెండు లక్షలు పెట్టి కార్‌ పార్కింగ్‌ని కొనుగోలు చేస్తే కార్లకు రక్షణ లేకుండా పోయిందని, చాలా కార్లు డ్యామేజ్‌ అయ్యాయని చెబుతున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఫ్లాట్స్‌ అమ్మకాలు ఇప్పుడు జోరందుకున్నాయని, ఎక్కువ రేట్లతోనే ఫ్లాట్స్‌ అమ్ముతున్నారని బాధితులు చెబుతున్నారు.  దీనిపై జయభేరి సంస్థ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.