నేపాల్ భూకంపం ధాటికి 2000కి పైగా మృతి

 

నేపాల్ లో నిన్న సంభవించిన పెను భూకంపం ధాటికి సుమారు2000కి పైగా ప్రజలు మృతి చెందినట్లు అధికారిక సమాచారం. కానీ అంతకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక వేలమంది క్షతగాత్రులయారు. అయినప్పటికీ వందల సంఖ్యలో పేకమేడల్లా కుప్పకూలిపోయిన భవనాల క్రింద ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉన్నారో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. క్షతగాత్రులతో అన్ని ఆసుపత్రులు నిండిపోయాయి. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ అనేకమంది వైద్యం కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. వివిధ దేశాల నుండి అనేక సహాయ, వైద్య బృందాలు తరలివచ్చి సహాయ పునరావాస చర్యలలో పాల్గొంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నిన్న మరొకమారు భూకంపం సంభవించింది. నిన్న సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.9 నమోదు కాగా, ఈరోజు కొన్ని సెకండ్లపాటు మాత్రమే సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.9గా నమోదైంది. కానీ ఈరోజు భూకంపం వలన మళ్ళీ అనేక భవనాలు కుప్పకూలాయి. కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ ఇంత భారీ భూకంపం సంభవించడంతో నేపాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలతో రోడ్ల మీదే కాలక్షేపం చేస్తున్నారు. ఈరోజు నేపాల్ తో బాటు డిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలలో కూడా స్వల్ప భూప్రకపంనలు వచ్చాయి. కానీ ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు.