ఆలోచనల్లో ఆకాశం.. ప్రజలతో మమేకం.. నయా చంద్రబాబు

నాలుగుదశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచీ ఆయనలో మారిన మనిషి ప్రస్షుటంగా కనిపిస్తున్నారు. సాంకేతికతను సుపరిపాలనకు కీలక ఇరుసుగా మార్చిన చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. పలువురు జాతీయ నాయకులతో ఆయనకు సన్నిహిత పరిచయాలున్నాయి. ప్రపంచ కుబేరులు, పారిశ్రామిక దిగ్గజాలతో ఆయనకు నేరుగా పరిచయాలు ఉన్నాయి.  

హైదారబాద్ అభివృద్ధి ప్రతి అడుగులోనూ చంద్రబాబు ముద్ర ఉంటుందనడంలో సందేహం లేదు. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన ఘనత కచ్చిదంగా చంద్రబాబుదే. హైటెక్ సిటీ అంటే, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ చంద్రబాబు నాయుడే గుర్తుకు వస్తారు. ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఆయన ప్రత్యర్థులు సైతం ఆ విషయాన్ని ఎలాంటి సంకోచం, భేషజాలూ లేకుండా అంగీకరిస్తాయి.  రాష్ట్ర విభజన తర్వాత కూడా  తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించ గలుగుతోందన్నా, అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నా చంద్రబాబు చలవే, దార్శనికతే కారణం అనడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనహైదరాబాద్ లోఐటీ రంగ అభివృద్ధి కోసం చేసిన కృషి, చూపిన పట్టుదల పడిన శ్రమ వల్లనే   మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే  ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరాయి.

ఈ రోజు  హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. విశ్వనగరంగా ఎదిగింది. ఎదుగుతోంది అంటే చంద్రబాబు  విజన్ 2020 యే కారణం.  అయితే ఈ క్రమంలో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కంటే.. అభివృద్ధి దార్శనికుడిగానే వ్యవహరించారు. దాంతో రాజకీయంగా ఒకింత నష్టపోయిన సంగతి ఎవరూ కాదనలేరు. హైటెక్ సీఎం అన్నది ఆయనకు ఒక పొగడ్త, ప్రశంసగానే కాకుండా విమర్శగా కూడా మారింది. చంద్రబాబు అంటే ఎప్పుడూ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఆలోచిస్తారు. అందుకోసం కార్యాచరణ రూపకల్పన చేస్తారు. అమలు చేస్తారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనే అంటారు. ప్రజలతో మమేకం కారన్న అపప్రధ అయనపై ఉంది. కార్యర్తలకు, పార్టీ నేతలకు పెద్దగా సమయం ఇవ్వరనీ, ఆయన దృష్టంతా పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధిపైనే ఉంటుందని పార్టీ శ్రేణులే చెబుతుంటాయి. ఈ క్రమంలో పార్టీకీ, ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పడి రాజకీయంగా నష్టం జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి.

అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మారారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, దార్శనికత ఉన్న ఆయన ఎటువంటి సంకోచం లేకుండా ప్రజలతో మమేకం అవుతున్నారు. పేదల ఇళ్లలోకి నేరుగా వెళ్లి వాళ్లకు తానే స్వయంగా టీ పెట్టి తన స్వహస్తాలతో అంది స్తున్నారు. ఇంత కాలం ప్రజలను కలవకుండా వారి బాగు, ప్రగతి కోసమే పరితపించిన చంద్ర బాబు ఇప్పుడు వారి బాగోగులను స్వయంగా పట్టించుకోవడమే కాకుండా వారితో మమేకమౌతున్నారు. ఈ మార్పు చంద్రబాబును ప్రజలకు మరింత చేరువ చేస్తున్నదనడంలో సందేహం లేదు. ఇది తెలు గుదేశం పార్టీకి కూడా ఒక సానుకూల అంశంగా మారుతున్నది. గతంలో చంద్రబాబు ఎంత ప్రజలకు ఇంకా ఏంచేయగలం అన్న ప్రణాళికలు రూపొందిస్తూ, అధికారులతో సమీక్షలతో బిజీబిజీగా ఉంటూ జనానికి అందుబాటులోకి వచ్చే వారు కాదు. ఆ కారణంగానే ప్రభుత్వం, పార్టీ మధ్య గ్యాప్ వచ్చింది. ప్రత్యర్థులకు విమర్శించే అవకాశం ఇచ్చింది.

ఇప్పుడు బాబు పూర్తిగా మారి.. ఒకే సమయంలో ప్రగతి పథక రచనలు, ప్రజలతో మమేకమవ్వడానికి సమయం కేటాయించడం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పార్టీ, ప్రభుత్వం మధ్య గ్యాప్ వచ్చే అవకాశాలు లేకుండా పోవడమే కాకుండా ప్రజలతో  చంద్రబాబు మమేకం కావడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని పరిశీలకులు అంటున్నారు.