ఉప్పు సముద్రం పాలౌతున్న వృధా జలాల వినియోగమే లక్ష్యం.. చంద్రబాబు
posted on Jan 10, 2026 8:28AM

నీటి వివాదాల వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాటిని సామరస్యంగా పరిష్కరిం చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. జలవివాదాలను రాజకీయం చేయడం వల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాన్ని ఇరువురు ముఖ్యమంత్రులూ కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే జల వివాదాల పరిష్కారం విషయంలో ఏపీ ఒక అడుగు ముందుకు వేస్తే.. తాము పది అడుగులు ముందుకు వేస్తామన్నారు. అదే విధంగా చంద్రబాబు కూడా తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
ఉప్పు సముద్రంలోకి వృధాగా పోతున్న నీటి వినియోగం విషయంలో తెలుగు రాస్ట్రాల మధ్య వివాదాలు అనవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్‌బుక్కులు పంపిణీ చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన ఆయన అనవసర వివాదాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు.
ప్రతి ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న 300 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో కరవు అనే మాటే ఉండదన్న చంద్రబాబు.. పోలవరం పూర్తయితే నీటి సమస్యలు తీరతాయనీ, పోలవరం నుంచి విశాఖపట్నం, అక్కడి నుంచి వంశధార వరకు నీటిని తీసుకెడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ కూడా మిగులు జలాలను వాడుకోవచ్చన్న ఆయన పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించి, అక్కడి నుంచి రాయలసీమకు నీరందించడం వల్లే ఆ ప్రాంతం హార్టికల్చర్ హబ్‌గా మారుతోందన్నారు.