ఆద్యంతం అలరించిన లాస్యాంగ 'నవ రామాయణం' నర్తనం
posted on May 10, 2022 9:30AM
లాస్యాంగ కూచిపూడి డాన్స్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాంశాలు తన్మయత్వం లో ముంచెత్తాయి. కళ్ళకు కట్టేలా 15 నిముషాల్లో నవ రామాయణం ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఉప్పల్ శిల్పారామంలో ప్రముఖ నాట్య గురు రోహిణి కందాల ఆధ్వర్యంలో లాస్యాంగ కూచిపూడి డాన్స్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
29 మంది రోహిణి కందాల శిష్యులు ఎంతో పరిణతతో నృత్యాంశాలు ప్రదర్శించి వారి క్రమశిక్షణ సాధన అంకితభావాన్ని చాటి చెప్పారు. జేమ్ జెమ్ పుష్పాంజలి లాస్య నర్తన విన్యాసం విశేషంగా ఆకర్షించింది. తాండవ గజానన, రాజశ్రీ శబ్దం తదితర అన్ని అంశాలు అలరించాయి. ఈ సందర్భంగా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా అందించి స్పూర్తి నిచ్చే లాస్యాంగ నర్తన యువ ప్రతిభ పురస్కారంతో సురేంద్రనాథ్ ను ఘనంగా సత్కరించారు.

ఈ వేడుకలో నాట్య గురువులు కళాకృష్ణ, డాక్టర్ వనజా ఉదయ్, కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ, పి. ఉమామహేశ్వరపాత్రుడు, పామర్తి పద్మావతి పాల్గొని చిన్నారులను అభినందించారు. గురు రోహిణి కందాల నట్టువాంగం చేయగా, గాత్రంతో మంథా శ్రీనివాస్, వయోలిన్ తో కె.అనిల్ కుమార్, మృదంగంతో ఎస్. నాగేశ్వరరావు, వేణువుతో సాయి భరద్వాజ్, ఘటంతో శ్రీహర్ష వాద్య సహకారం అందించి రక్తి కట్టించారు. లాస్యాంగ ఆర్టిస్టిక్ డైరెక్టర్ రోహిణి కందాల, గౌరి పర్యవేక్షించారు.
