అవార్డులెందుకు కలెక్షన్లుండగా!

 

రాజమౌళి దర్శకత్వం వహించిన చిన్నజీవితో చేసిన చిన్న సినిమా ‘ఈగ’ రెండు జాతీయ అవార్డులు స్వంతం చేసుకోవడం చాలా సంతోషించవలసిన విషయమే. గత మూడేళ్ళుగా ఒక్క జాతీయ అవార్డు కూడా ఖాతాలో పడని టాలివుడ్ కి ఇది కొంచెం ఉపశమనం కలిగించేదే అయినా పొంగిపోవలసిన విషయం మాత్రం కాదు.

 

2008లో కూడా రాజమౌళి తీసిన సినిమా ‘మగధీర’ వల్లనే మన సినీ పరిశ్రమకు అవార్డు దక్కింది. అప్పుడు ‘స్పెషల్ ఎఫెక్ట్స్’ మరియు కొరియోగ్రఫీకి అవార్డులు దక్కగా ఈ సారి కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు ఉత్తమ బాష చిత్రం అవార్డులు దక్కడం గమనిస్తే, మన సినీ పరిశ్రమ సాంకేతికంగా దేశంలో ఇతర చిత్ర పరిశ్రమల కంటే చాల ముందు ఉన్నట్లు స్పష్టం అవుతున్నపటికీ, మిగిలిన అంశాలలో పూర్తిగా వెనుకబడిపోయామని స్పష్టం చేస్తోంది.

 

బహుశః మన తెలుగు సినీ నిర్మాతలు, ప్రేక్షకులు కూడా కేవలం కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యం ఈయడమే దీనికి కారణం అని చెప్పవచ్చును. కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న సినిమాలు విజయవంతంగా ఆడాలంటే తప్పనిసరిగా మూస ఫార్ములాలో వెళ్ళక తప్పదనే దృడమయిన అభిప్రాయం నిర్మాతలు కలిగిఉంటే, నాలుగు ఫైట్స్, నాలుగు పాటలు, ఒక ఐటెం సాంగు లేకపోతే ధియేటర్లవైపు కన్నెత్తి కూడా చూడని ప్రేక్షకులు, మంచి సినిమాలు, అవార్డుల గురించి పెద్దగా పట్టించుకోవడం మానేసి చాలాకాలం అయింది. ఒక పెద్ద హీరో సినిమాకి వచ్చిన కలెక్షన్లే సినిమా గొప్పదన్నాన్ని తెలియజేసే ప్రామాణికంగా ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. అందువల్ల నిర్మాతలు, హీరోలు కూడా అదే దిశలో ముందుకు సాగిపోతున్నారు.

 

ఇక, అటువంటప్పుడు మన కంటే చిన్న పరిశ్రమలుగా భావిస్తున్న మాలీవుడ్ (మలయాళ సినీ పరిశ్రమ) 12 అవార్డులను, మరాఠీ, తమిళ్ చిత్ర సీమలు చెరో ఐదేసి అవార్డులను పట్టుకుపోయాని వాపోవడం కూడా అనవసరం. ఎందుకంటే మన పెద్ద సినిమా కలెక్షన్ల రికార్డులు వారెవరూ ఎన్నడూ కూడా బ్రద్దలు గొట్టలేరు గనుక.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu