సొంత పార్టీ నేతలే చంద్రబాబుని మోసం చేశారు: లోకేష్
posted on May 28, 2019 4:03PM

ఎన్టీయార్ 97వ జయంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి మాజీ మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుని సొంత పార్టీ నాయకులే మోసం చేశారని అన్నారు. చంద్రబాబు ఓటమికి పదిశాతం ఈవీఎంలు కారణమైతే.. 90 శాతం నాయకులే కారణమని లోకేష్ అన్నారు.
కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదేనని ఆయన చెప్పారు. కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదన్నారు. 2024లో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురవేస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన చోటే గెలవాలనేది తన సంకల్పమని, ఎమ్మెల్సీగా ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు సేనాధిపతి అయితే మనమంతా సైనికులమని ఆయన కార్యకర్తలనుద్దేశించి లోకేశ్ వ్యాఖ్యానించారు. 2024లో ఏపీ సీఎంగా చంద్రబాబు మళ్లీ ప్రమాణస్వీకారం చేస్తారని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.