ఎన్టీఆర్ ఘాట్ బాధ్యత ఎవరిది?.. ఎందుకు అలంకరించలేదు
posted on May 28, 2019 5:26PM

ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి వచ్చినా, వర్థంతి వచ్చినా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అద్భుతమైన ఏర్పాట్లు జరిగేవి. వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసేవారు. ఈ ఏడాది మాత్రం.. అలాంటిదేమి కనిపించలేదు. కనీసం ఘాట్‌ను శుభ్రపరచలేదు. దీంతో ఉదయం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అసహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇకపై ఎన్టీఆర్ జయంతి వచ్చినా, వర్థంతి వచ్చినా ఏర్పాటు తానే చూసుకుంటానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
అయితే ప్రతి ఏడాది అద్భుతంగా జరిగే ఏర్పాట్లు ఈసారి ఎందుకు జరగలేదు? అసలు ఈ ఏర్పాట్లు ఎవరు చూసుకుంటారు? అని చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఎన్టీఆర్ ఘాట్ పర్యవేక్షణ మొత్తం బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథారిటీది. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల టూరిజం కోసం.. చంద్రబాబు హయాంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ అధారిటీని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ మొయిన్‌టనెన్స్ మొత్తం.. ఆ అధారిటీనే చేయాలి. జయంతి, వర్థంతి వంటి కార్యక్రమాలకు ఏర్పాట్లను కూడా ఆ అధారిటీనే చేయాలి. గతంలో ఏర్పాట్లు చేసిన ప్రాజెక్ట్ అధారిటీ తర్వాత చేయడం మానేసింది. కారణం.. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలంకరణ బాధ్యతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తీసుకుంది. ప్రాజెక్ట్ అధారిటీ చేసే ఏర్పాట్లపై పెద్దగా నమ్మకం లేని టీడీపీ జయంతి, వర్థంతిలతో పాటు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేటప్పుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించే సమయంలో ప్రత్యేకంగా అలంకరించేవారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలు దీన్ని చూసేవి. కానీ.. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ ఢీలా పడిపోయింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా అమరావతి తరలి పోయింది. దీనికితోడు ఎన్నికల్లో ఓటమి బాధలో మునిగిపోయి.. గుంటూరులో ఎన్టీఆర్ జయంతిని జరుపుకోవాలని నిర్ణయించుకున్న టీడీపీ వర్గాలు.. హైదరాబాద్ గురించి ఆలోచించలేదు. వాళ్లే ఆలోచించలేదు కాబట్టి.. తమకెందుకని తెలంగాణ ప్రభుత్వం కూడా లైట్ తీసుకున్నట్లు ఉంది. దీంతో ఎప్పట్లాగే పూలతో అలంకరించి ఉంటారని.. వచ్చిన ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు షాక్ తగిలింది.