పరిటాల బాటలో ప్రత్తిపాటి.. టీడీపీని వీడి బీజేపీలోకి!!
posted on May 28, 2019 3:29PM

మూలిగే నక్క మీద తాటికాయలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలే టీడీపీ ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమి నుంచి కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అయితే కోలుకునే సమయం కూడా ఇవ్వకుండానే కొందరు నేతలు టీడీపీకి షాకులు ఇవ్వడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరిటాల సునీత కుటుంబం టీడీపీని వీడి బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో సీనియర్ నేత కూడా టీడీపీని వీడడానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఆయన త్వరలో బీజేపీ లో చేరబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం. పుల్లారావుపై రాజకీయంగా ఎన్నో ఆరోపణలున్నాయి. అందుకోసమనే ఆయన బీజేపీ పార్టీలో చేరిపోయి, పెద్ద నేతలతో సంప్రదింపులు జరిపి తమ కేసులన్నీ కూడా మాఫీ చేయించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ మేరకు త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని రాజకీయ వర్గాల టాక్.
అటు పరిటాల కుటుంబమైనా, ఇటు ప్రత్తిపాటి అయినా బీజేపీ వైపు చూడటానికి ప్రధాన కారణం.. ఈ ఐదేళ్లు వైసీపీని తట్టుకొని నిలబడగలమా అనే భయమే అని తెలుస్తోంది. కొందరు వ్యక్తిగతంగా తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశముందన్న భయంతో, మరికొందరు తమపై ఉన్న కేసులకు భయపడి.. ఇలా రకరకాల కారణాలతో బీజేపీలో చేరాలని పలువురు నేతలు చూస్తున్నారట. టీడీపీలో ఉండలేక, వైసీపీలో చేరలేక బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారట. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ఉండవు. అందుకే ప్రస్తుతానికి బీజేపీ అయితేనే సేఫ్ అని నాయకులు భావిస్తున్నారట.