లేగదూడకు నామకరణ మహోత్సవం!
posted on Jan 3, 2026 8:35AM

కన్నబిడ్డగా పెంచుకున్న ఆవు లేగదూడకు జన్మనిస్తే.. ఆ లేగదూడను తన మనవరాలిగా భావించి ఘనంగా నామకరణ మహోత్సవం చేసిన రైతు ఉదంతమిది. తనకు ఆడపిల్లలు లేరన్న చింత తీర్చుకోవడానికి ఓ ఆవును తీసుకువచ్చి, దానికి గౌరి అని నామకరణం చేసి పెంచుకున్న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లె గ్రామానికి చెందిన పెండ్యాల సురేందర్, ఆ ఆవుకు పుట్టిన లేగ దూడకు శుక్రవారం (జనవరి 2) ఘనంగా నామకరణ మహోత్సవం జరిపించాడు. వివరాల్లోకి వెడితే.. పెండ్యాల సురేందర్ స్వరూప దంపతులు ఐదేళ్ల కిందట వరంగల్‌లోని మహారుషి గోశాల నుండి ఓ ఆవును తెచ్చుకుని దానికి గౌరి అని నామకరణ చేసారు.
దానిని నిత్యం పూజిస్తూ కన్నబిడ్డలా సాకారు. ఆ ఆవు గత నెల 19న ఓ లేగదూడకు జన్మనిచ్చింది. లేగదూడ పుట్టి 13 రోజులు పూర్తి కావడంతో ఆ లేగదూడకు ఘనంగా నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఇందు కోసం శుక్రవారం (జనవరి 2) దానికి తన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులను గ్రామస్తులను ఆహ్వానంచి అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు.
ఇళ్లల్లో పిల్లలకు ఏ విధంగా అయితే బాల సారె నిర్వహిస్తారో సరిగ్గా అలాగే ఈ నామకరణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి దానికి నందీశ్వరుడు అని పేరు పెట్టారు. ఈ నామకరణ మహోత్సవాన్ని గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి తిలకించి ఇలాంటి తంతు ఎక్కడా చూడలేదని ఇదే మొదటి సారి అని ఇంత మంచి కార్యక్రమం చూడడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.