చంద్రబాబుని కొట్టబోయిన మర్రి చెన్నారెడ్డి

 

ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబుని కొట్టబోయారని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ..  చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కడుతున్నాడని ఆగ్రహించి అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఆయన చేతిలో ఉన్న స్టిక్‌తో చంద్రబాబుని కొట్టబోయారని నాటి ఉదంతాన్ని వివరించారు. చంద్రబాబుని అందరిలో చెన్నారెడ్డి కొట్టబోవడంతో ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదన్నారు. ఆ తర్వాత తాను చెన్నారెడ్డి వద్దకు వెళ్లి ఎందుకు కొట్టబోయారని అడిగితే ‘పార్టీలో ముఠాలు కడుతున్నాడు, చంద్రబాబుని ఎవరూ చేరదీయకండి’ అని చెప్పారన్నారు. 

తిరుపతి రైల్వేస్టేషన్‌లో చంద్రబాబు దొంగతనం చేసినట్లు కేసు ఉందని ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో నాదెండ్ల చెప్పారు. అయితే దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా .. అది నిజమే అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని, లేకుంటే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారని చెప్పారు. బీసీ సభలు పెట్టి బీసీలకు అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్న చంద్రబాబు మొదటిసారిగా బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయితే అతన్ని దింపుతానంటూ తిరుగుతున్నాడని మండిపడ్డారు. నోట్ల రద్దును చంద్రబాబు సమర్థించిన విషయాన్ని గుర్తు చేశారు.  తెలంగాణ వెళ్లి  నేను లేఖ ఇవ్వటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్తున్న చంద్రబాబు..ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీశారంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో ప్రాంతీయ పార్టీ (తెలుగుదేశం) పెట్టి పెద్ద తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే నాదెండ్ల ఇటీవల కొన్ని టీవీ ఛానల్స్ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు,మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఎన్టీఆర్ గురించి తాను చెప్పిన విషయాలన్నీ వాస్తవాలేనని, వాటన్నింటికీ తాను కట్టుబడి ఉన్నానని నాదెండ్ల ఈ సందర్బంగా స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిని తానేనని తేల్చిచెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు తన మంత్రి పదవిని ఎన్టీఆర్ తీసేస్తే ఆయన సీఎం పదవిని తాను తీసేశానని తెలిపారు. ఈ విషయంలో వెన్నుపోటు అంటూ తనపై 30 ఏళ్లుగా చెడుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనను విలన్‌గా చూపిస్తూ ఎవరు సినిమా తీసినా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయో పిక్స్ వస్తున్న సంగతి తెలిసిందే.