ఎందుకు ఉలిక్కి పడుతున్నావ్ చంద్రబాబు

 

మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ముద్రగడ ఈ నెల 31వ తేదీన కత్తిపూడిలో ‘చలో కత్తిపూడి సమావేశం’ నిర్వహించడానికి తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే సభకు తమ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని పేర్కొన్న నేపథ్యంలో ముద్రగడ సభను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ముద్రగడ లేఖ రాశారు. లేఖలో ముద్రగడ చంద్రబాబుకు పలు ప్రశ్నలను సంధించారు.

"మా జాతి 13 జిల్లాల పెద్దలతో గత మూడు సంవత్సరాలుగా జరిగిన ఉద్యమం గురించి మాట్లాడుకోవడానికి కత్తిపూడిలో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ కలయిక గురించి మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదు. అన్ని పార్టీల పెద్ద నాయకులు నిత్యం రోడ్డుకు అడ్డంగా ఎన్నో సభలు పెట్టుకుంటున్నారు. మీరు కూడా ధర్మపోరాట దీక్షల వంకతో విజయవాడలాంటి అతి పెద్దపట్టణం నాలుగు రోడ్ల జంక్షన్‌లో ట్రాఫిక్‌ మళ్లించి రోడ్డుకు అడ్డంగా కుర్చీలు వేసి ఉపన్యాసాలు చెప్పారు. అలాగే తొందరలో మీరు ఢిల్లీలో కూడా దీక్ష చేస్తానని చెబుతున్నారే. మీరు బస్సు యాత్ర పేరుతో ఏ జిల్లాకైనా బయలుదేరినప్పుడు ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేస్తున్నారే.  మీ అందరికీ ఒక రాజ్యాంగం.. మాకు మరొక రాజ్యాంగమా ముఖ్యమంత్రి గారూ’ అని ముద్రగడ ప్రశ్నించారు. మొత్తం రెండు పేజీల లేఖను చంద్రబాబుకు ముద్రగడ రాశారు.