ప్రజాపోరాట యోధుడు ఇకలేరు
posted on Jan 29, 2019 9:21AM
మాజీ కేంద్ర మంత్రి జార్జి మ్యాథ్యూ ఫెర్నాండెజ్ (88) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఫెర్నాండెజ్ మంచానికే పరిమితమయ్యారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1930 జూన్ 3న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించిన ఫెర్నాండెజ్ 1967లో దక్షిణ ముంబై నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి కేబినెట్‌లో రక్షణ మంత్రిగా పనిచేసిన ఫెర్నాండెజ్ సమాచార శాఖ, రైల్వే, పరిశ్రమలు వంటి పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. జనతాదళ్ నేతగా పేరొందిన ఫెర్నాండెజ్ వీపీ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా వ్యవహరించారు. మాతృసంస్ధ జనతాదళ్‌ను వీడిన అనంతరం 1994లో సమతా పార్టీని స్ధాపించిన ఫెర్నాండెజ్ ఎన్డీఏలో భాగస్వామిగా బీజేపీతో కలిశారు. ఎన్డీఏలో కీలక నేతగా ఎదిగిన ఫెర్నాండెజ్ వాజ్‌పేయికి అత్యంత విధేయుడిగా పేరొందారు. ఫెర్నాండెజ్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణుపరీక్షలను భారత్ విజయవంతంగా చేపట్టింది. ఫెర్నాండెజ్‌ను పలు వివాదాలు చుట్టుముట్టిన సందర్భాల్లో వాజ్‌పేయి ఆయనకు వెన్నంటి నిలిచారు. 2009 ఆగస్టు నుంచి 2010 జులై వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఫెర్నాండెజ్ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కార్మిక సంఘాల్లో కీలకంగా పనిచేసిన జార్జి ఫెర్నాండెజ్ ప్రజాపోరాట యోధుడిగా పేరు సంపాదించారు.