మహిళా యంపీలకు క్షమాపణ చెప్పిన మురళీ మోహన్

 

మహిళా యంపీలకు క్షమాపణ చెప్పిన మురళీ మోహన్ తెదేపా యంపీ మురళీ మోహన్ మహిళల వస్త్రధారణపై నిన్న లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపడంతో ఆయన క్షమాపణ చెప్పుకోవలసి వచ్చింది. మహిళలపై దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అత్యాచారాలపై జరుగుతున్న చర్చలో పాల్గొంటూ ఆయన “నా సోదరీమణులు, దేశంలో అమ్మాయిలు అందరూ మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం హుందాగా ఉండే వస్త్రాలు ధరించాలని సవినయంగా కోరుతున్నాను,” అని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ “సమాజంలో పురుషులు కూడా మహిళలను తమ కుటుంబ సభ్యులగానే భావించి గౌరవించాలని, అదే భరతమాతకు మనం ఇచ్చే గౌరవం’’ అని అన్నారు. ఆయన మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై సభలో మహిళా యంపీలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా, కాంగ్రెస్‌ ఎంపీ కుమారి సుస్మితా దేవ్‌, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలె తదితరులు ఆయన వ్యాఖ్యలను రికార్డు నుండి తొలగించి ఆయనను సభ నుండి బయటకు పంపించాలని డిమాండ్ చేయడంతో, మురళీ మోహన్ స్పందిస్తూ ‘‘నేను తప్పుగా మాట్లాడానని మహిళా సభ్యులు భావించినట్లయితే వాటిని నేను ఉపసంహరించుకొంటున్నాను. నా వ్యాఖ్యలు వారిని ఇబ్బందికి గురి చేసి ఉంటే అందుకు క్షమాపణలు తెలుపుతున్నాను’’ అని చెప్పడంతో ఈ వివాదానికి తెరపడింది.