విశాఖ ఉక్కును కాపాడుకుందాం.. కానీ !  విజయసాయి వ్యాఖ్యలతో రచ్చ  

సేవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతమవుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వైసీపీ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమయంలో కార్మికులకు అండగా నిలవాల్సిన వైసీపీ నేతలే .. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మరింత గందరగోళ పరుస్తున్నారు. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో  ఇప్పుడు రచ్చ జరుగుతోంది. 
           
విశాఖలో జరుగుతున్న అఖిలపక్ష నిరసన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు ఎంపీ విజయసాయి రెడ్డి. అయితే  విజయసాయి మాట్లాడుతుండగా  కొందరు కార్మికులు అభ్యంతరం చెప్పారు. విశాఖ ప్లాంటును కొనసాగించే ప్రయత్నం చేద్దామని, కొన్ని సార్లు లక్ష్యం నెరవేరుతుందని, కొన్ని సార్లు నెరవేరకపోవచ్చని.. దేనికైనా పట్టువిడుపు ఉండాలి   అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనకు వ్యతిరేక నినాదాలు వినిపించాయి. ఎంపీ విజయ్ సాయి రెడ్డి ప్రసంగాన్ని కార్మికులు అడ్డుకున్నారు. ఉక్కు మంత్రి, ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకుని ఆయన్ని కలిసేలా ప్రయత్నిస్తానని విజయ్ సాయి రెడ్డి సర్ది చెప్పారు. 
 
విజయసాయి వ్యాఖ్యలపై సీపీఎం నేతలు అభ్యంతరం తెలిపారు. ‘‘మీకు నచ్చినా...నచ్చకపోయినా నేను చెప్పేది వాస్తవం’’ అని విజయసాయి వాదించారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ సహా మిగితా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వెనుదిరిగారు. విజయసాయిరెడ్డి కారును ఆందోళనకారులు  అడ్డుకున్నారు. చివరకు పోలీసుల సహాయంతో ఎంపీ విజయసాయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. విజయసాయి తీరుపై కార్మికులు భగ్గుమంటున్నారు. కార్మికులకు భరోసా కల్పించాల్సింది పోయి... కష్టమనే అర్ధం వచ్చేలా మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విజయసాయి వ్యాఖ్యలతో  కేంద్రంతో కలిసి రాష్ట్ర సర్కారే ఈ కుట్ర చేస్తుందనే అనుమానాలు వస్తున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.