ఈ అమావాస్య ముహూర్తమేంది సారు.. తలలు పట్టుకుంటున్న కార్పొరేటర్లు

జీహెచ్ఎంసీ ఎన్నికలలో నెగ్గిన కార్పొరేటర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చేసింది. ప్రమాణ స్వీకారం చేసి కార్పొరేట‌ర్ సీటులో కూర్చుందామని ‌ త‌హ‌త‌హ‌లాడుతున్న ఆ నేత‌ల కోరిక తీర‌బోతోంది. అయితే ఇన్ని రోజులు ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మం ముహూర్తం కొత్త కార్పొరేట‌ర్లను వ‌ణికిస్తోంది. వారి భయానికి కల ముఖ్య కారణం ఏంటంటే ఐదేళ్లపాటు ఉండాల్సిన ప‌ద‌వి కోసం చేసే ప్రమాణ స్వీకార కార్యక్రమం అమావాస్య రోజు పెట్ట‌డ‌మేంట‌ని తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

అసలే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాలేదు. తమకు కావాల్సిన బ‌లం లేక‌పోయినా అధికార టిఆర్ఎస్ పార్టీ మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ల‌ను నిలబెడుతోంది. దీంతో గ్రేటర్ పాల‌క మండ‌లిలో ఏ క్షణం ఎలాంటి ముస‌లం పుడుతుందో.. త‌మ ప‌ద‌వుల‌కు గండం ముంచుకొస్తుందోన‌ని కొత్త కార్పొరేటర్లు టెన్ష‌న్ ‌ప‌డుతున్నారు. దీంతో ప్ర‌మాణ స్వీకార ముహుర్తంపై తమ అభ్యంత‌రాల‌ను అధికారుల దృష్టికిపార్టీలు తీసుకెళ్లాయి . అయితే ఇది ఎన్నికల సంఘం నిర్ణ‌య‌మ‌ని, దీంతో తామేం చేయ‌లేమ‌ని అధికారులు కూడా చేతులెత్తేశారు. దీంతో దేవుడిపై భారం వేసి కార్పొరేటర్లు ప్ర‌మాణ‌స్వీకారానికి సిద్ద‌మ‌వుతున్నారు.