నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్! 

పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికలు  ముంచుకొస్తున్న వేళ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ టీచర్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ కీలక నేత పూల రవీందర్ గులాబీ పార్టీకి రాజానామా చేశారు. తనకు పార్టీ కంటే ఉపాధ్యాయ సమస్యలే ముఖ్యమని ప్రకటించారు. తాను రాజీనామా చేయమడే కాదు.. మిగితా టీచర్ ఎమ్మెల్సీలతోనూ రాజీనామా చేయిస్తానని ప్రకటించారు పూల రవీందర్. 

పీఆర్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన మహాధర్నాకు పూల రవీందర్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. అయితే కొందరు ఉపాధ్యాయులు ఆయన మాట్లాడుతుండగా అడ్డగించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీచర్లను అవమానిస్తున్న టీఆర్ఎస్ నుంచి బయటికి రావాలని డిమాండ్ చేశారు. దీంతో పీఆర్టీయూ సభ్యుల కోరిక మేరకు.. ఆ సభా వేదికపైనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పూల రవీందర్. రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించకపోతే హైదరాబాద్‌లో జరిగే మహాధర్నారోజు పీఆర్‌టీయూ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిద్దామన్నారు.

టీఆర్‌ఎస్‌పార్టీ ముఖ్యం కాదని, పీఆర్‌టీయూ ముఖ్యమన్నారు పూల రవీందర్. పీఆర్‌టీయూ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాల సమస్యలు పరిష్కారానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం 45శాతం పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్‌ విధానం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమోషన్స్‌, బదిలీల షెడ్యూల్‌ ప్రకటించి, అన్ని పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలన్నారు.  నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గత ఏడాది వరకు పని చేశారు పూల రవీందర్. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసిన తర్వాత ఆయన ఆ పార్టీకి కొంత దూరంగానే ఉంటున్నారు.