ఏపీకి హోదా వచ్చినట్టే.. మోడీ నవ్వులో అంత అర్ధం ఉందా..!

 

ఏపీకి ప్రత్యేక హోద వచ్చేసినట్టేనటా.. అందుకు కారణం మోడీ నవ్వడమేనట.. ఇంతకీ ఈవిషయం ఎవరు చెప్పారబ్బా అనుకుంటున్నారా.. ఇంకెవరూ స్వయంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయు. ఏపీ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీలందరూ పార్లమెంట్లో నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

 

ఇదిలా ఉండగా నిన్న టీడీపీ ఎంపీల బృందం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అక్కడ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మంత్ర పఠనం చేశారు. దీంతో మోడీ పగలబడి నవ్వారు. అయితే మోడీ నవ్వుపై స్పందించిన వెంకయ్యనాయుడు టీడీపీ నేతలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. మోదీ అంతగా పగలబడి నవ్వారంటే మీ పని అయిపోయినట్లేనని అని అన్నారట. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లేనని కూడా ఆయన చెప్పారట. దీంతో ఇప్పుడు అందరూ వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారు. వెంకయ్యనాయుడు ఏదో సరదాగా అన్నారా..లేక సీరియస్ గానే అన్నారా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

మరోవైపు ఎలాగూ శివప్రసాద్ అప్పుడప్పుడు విచిత్రమైన వేషాలు వేసుకుంటూ తన నిరసనను తెలుపుతుంటారు. ఆ వేషాలు చూస్తే మామూలుగానే అందరికి నవ్వొస్తుంటుంది. మరి మోడీకి కూడా శివప్రసాద్ ను చూసి నవ్వు వచ్చివుంటదని పలువురు అనుకుంటున్నారు. మరి మోడీ ఎందుకు నవ్వారో తెలియదు కానీ.. వెంకయ్య నాయుడు చెప్పిన వ్యాఖ్యలు వింటే మాత్రం ఏపీ ప్రజలకు కాస్త ఊరట లభించినట్టయింది. చూద్దాం మరి మోడీ నవ్వులో ఏం అర్ధం దాగుందో..