అన్నింటికంటే విలువైనది

అనగనగా ఓ కాకి! దానికి ప్రపంచంలో ఎక్కడ చూసినా తనలాంటి కాకులే కనిపించేవి. తోటి కాకుల కావుకావులతో దాని చెవులు చిల్లులు పడిపోయేవి. అసలు ఆ కాకులను చూడగానే జనమంతా విసుక్కునేవారు. ఏదో కాసిన ఎంగిలి మెతుకులు విదిలించి వాటిని వదిలించుకునేవారు. రోజురోజుకీ ఆ కాకికి తన మీద తనకే అసహ్యం వేయడం మొదలైంది. ‘కావుకావుమంటూ కరుకుగా అరవాలి. సర్వభక్ష్యాలనూ తిని కడుపు నింపుకోవాలి. ఇదీ ఓ బతుకేనా!’ అనుకుంటూ ఓ రోజు దీర్ఘాలోచనలో ఉండగా... దానికి పక్కనే ఉండే మామిడి చెట్టు మీద నుంచి ఒక తీయని గొంతు వినిపించింది.

 

కాకి పక్కకి తిరిగి చూసేసరికి మామిడి చెట్టు మీద ఒక కోయిల కనిపించింది. ‘మిత్రమా! నీ గొంతు భలే మధురంగా ఉంది సుమా! పైగా నాలాగా నువ్వు నానాచెత్తా తినాల్సిన అవసరం లేదు. హాయిగా ఆ మామిడి చిగురులతో కడుపు నింపుకోవచ్చు. నీ గొంతు విన్న ఈ లోకం ఉగాది వచ్చేసిందని పొంగిపోతుంది. నీదెంత అదృష్టజాతకం’ అని తెగ పొగిడేసింది.
‘ఆ నాదీ ఒక బతుకేనా!’ అంది కోకిల నిట్టూరుస్తూ. ఆపై ‘నా రంగు నీకంటే నలుపు. పైగా వసంత రుతవులో తప్ప కూయలేను. అంతదాకా ఎందుకు! ఆఖరికి నా పిల్లలని కూడా నేను పొదగలేక, నీ గూటిలోకి చేరుస్తుంటాను. నా జాతి ముందుకి సాగుతోందంటే అది నీ చలవే. ఇక అదృష్టం అంటావా! ఆ మాట వస్తే చిలుకే గుర్తుకువస్తుంది. పంచరంగుల వన్నెలు, పంచదార పలుకులు దాని సొంతం కదా’ అని నిట్టూర్చేసింది.

 

కోకిల మాటలు విన్న కాకికి అందులో నిజం లేకపోలేదనిపించింది. వెంటనే ఓ చిలుకని వెతుక్కుంటూ బయల్దేరింది. కొన్ని గడియలు గడిచేసరికి ఓ జామచెట్టు మీద మాంచి దోరపండుని తింటున్న చిలకమ్మ కనిపించింది. ‘చిలుకా క్షేమమా! ఇప్పటిదాకా నీ అదృష్టం గురించే నేనూ కోకిలా మాట్లాడుకున్నాము. నిన్ను చూస్తుంటే కోకిల చెప్పినదానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. ఏమి అందం, ఏమి గాత్రం... పైగా కమ్మని జామపళ్లతోనే కడుపు నింపుకునే భాగ్యం. అసలు బతుకంటే నీదే!’ అంటూ పొగడ్తలను వల్లె వేసింది.

 

‘ఉష్‌! గట్టిగా అరవబాక. ఏ వేటగాడన్నా వింటే నన్ను పట్టుకుపోయి పంజరంలో బంధించేయగలడు. అయినా నాదీ ఒక అందమేనా? నాదీ ఒక స్వరమేనా? అసలు నువ్వెప్పుడన్నా నెమలి అనే పక్షిని చూశావా? అది పురివిప్పి నాట్యమాడటాన్ని గమనించావా? అదీ అందమంటే! అదీ నాట్యమంటే! అదీ అదృష్టమంటే!’ అంటూ నోరు తెరుకుని ఉండిపోయింది. కాకికి చిలుక మాటలు నిజమే కదా అనిపించాయి. తానెప్పుడూ నెమలి నాట్యం గురించి వినడమే కానీ చూసే అదృష్టం కలుగలేదు. ఈసారి ఆ నాట్యమేదో తను కూడా చూసి తీరాలి. చిలుక చెప్పిన మాటలను పూర్తిగా రూఢిచేసుకోవాలి. నెమలి జీవితమే అన్నింటికంటే అదృష్టజాతకం అని రుజువుపరుచుకోవాలి. అలా అనుకుంటూ నెమళ్లు ఎక్కువగా తిరుగాడే ప్రాంతానికి వెళ్లి కాపువేసింది.

 

కాకి అదృష్టం ఏమో కానీ, కాసేపట్లోనే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గుంపులోని నెమళ్లు కొన్ని పురివిప్పి నాట్యం చేయడం మొదలుపెట్టాయి. ఆ నాట్యాన్ని చూసి కాకి కళ్లు చెదిరిపోయాయి. ఏం అందం! ఏం నాట్యం! ఏం ఈకలు! ఏం హొయలు! అనుకుంటూ ఆశ్చర్యపోయింది. వెంటనే ఓ నెమలి దగ్గర వాలి ‘ఆహా అదృష్టమంటే మీదే కదా! అసలు పక్షిజాతిలో మిమ్మల్ని మించినవారు లేనే లేరు. మీ గాత్రం, మీ నాట్యం, మీ అందం.... ముందర మా బతుకులన్నీ బలాదూర్‌’ అనేసింది.

 

ఆ మాటలు విన్న నెమలి కళ్లలోంచి కన్నీరు ఒలికింది ‘ఓసి పిచ్చిదానా! నాదీ ఒక బతుకేనా! మబ్బు పట్టినప్పుడు తప్ప నేను నాట్యం చేయలేను. మిగతా సమయాలలో ఈ ఈకలు నాకు బరువు. పైగా ఈ ఈకల కోసమే వేటగాళ్లు నన్ను వేటాడుతూ ఉంటారు. ఈ శరీరాన్ని వండుకు తినేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇక అన్నింటికీ మించిన దౌర్భాగ్యం చెప్పనా! పక్షినన్న మాటే కానీ ఆకాశంలో అంతెత్తున ఎగరగలనా? నా మటుకు నాకైతే నిన్ను చూసినప్పుడల్లా భలే ఈర్ష్యగా ఉంటుంది. ఏది పడితే అది తిని బతికేస్తావు. ఆకాశంలో చక్కుర్లు కొడుతూ తిరిగేస్తావు. నీకు వేటగాళ్ల బాధ లేదు. ఆకలితో ఉండే రోజూ ఉండదు. హాయిగా వేళకింత తింటూ, పిల్లల్ని కంటూ, గూట్లో గువ్వల్లే బతికేస్తావు. అసలు అదృష్టమంటే నీది. అన్నింటికంటూ అమూల్యమైన స్వేచ్ఛ నీ దగ్గర ఉంది. అన్నింటికంటే శాపమైన ఆకలి నీ జోలికి రాదు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

నెమలి మాటలకు కాకి మనసు ఆకాశంలో తేలిపోయింది. ఆ మనసుతో పాటే తాను కూడా రివ్వున నింగికి ఎగిరిపోయింది.

(జానపద కథ ఆధారంగా)

- నిర్జర.