చివరికి మిగిలేది!
posted on Jan 8, 2021 9:30AM
అది ఓ ప్రభుత్వ ఆసుపత్రి... అందులోని ఐసీయూ వార్డు. ఆ వార్డులో చావుబతుకుల మధ్య ఉన్న ఓ వృద్ధుడు. ఖచ్చితంగా అతను ఆ రాత్రిని మించి బతకడని వైద్యులందరికీ తేలిపోయింది. అందుకనే అతని బంధువులు అందరికి ఫోన్లు చేసి త్వరగా రమ్మంటున్నారు. ఆసుపత్రిలో అతని తాలూకు పిల్లలు ఎవరన్నా ఉన్నారేమో అని ఓ నర్సు వార్డు బయట అటూఇటూ చూసింది. వార్డు బయట బెంచీ మీద ఓ యువకుడు కనిపించాడు. ‘ఐసీయూ వార్డులో ఫలానా పెద్దాయన మీ తండ్రేనా!’ అని అడిగింది.‘ఏ ఏమైంది!’ అని కంగారుగా అడిగాడు ఆ యువకుడు.
‘ఆయన ఆఖరి క్షణాల్లో ఉన్నారు. తన కొడుకుల కోసం తెగ కలవరిస్తున్నారు. ఈ రాత్రి కాస్త ఆయన పక్కనుంటే ప్రశాంతంగా కన్నుమూస్తారు’ అని చెప్పుకొచ్చింది నర్సు.‘నేను ఆయన చిన్న కొడుకుని. దయచేసి ఈ రాత్రి ఆయన పక్కనే ఉండే అవకాశం ఇవ్వండి,’ అని అడిగాడు యువకుడు. యువకుడు లోపలికి వెళ్లేసరికి వృద్ధుని పరిస్థితి నిజంగానే బాగోలేదు. కళ్లు తెరుచుకోవడం లేదు. ఏదేదో కలవరిస్తున్నాడు. కొడుకుల స్పర్శ కోసం చేతిని చాస్తున్నాడు. యువకుడు ఠక్కున వెళ్లి ఆ చేతిని అందుకున్నాడు. అతని పక్కనే ఒక బల్ల వేసుకుని రాత్రంతా కూర్చున్నాడు.
ఆ రాత్రి ఒకో జాము గడిచేకొద్దీ వృద్ధుడు తన జీవితానికి సంబంధించి ఏవేవో చెబుతూ ఉన్నాడు. దానికి యువకుడు ఊ కొడుతూనే ఉన్నాడు. మధ్యమధ్యలో వృద్ధుడు యువకుడి చేతిని గట్టిగా అదిమిపట్టుకుంటూ ఉన్నాడు. చివరికి ఆ సమయం రానే వచ్చింది. వృద్ధుడు శరీరంలో ఇక ప్రాణం నిలిచేట్లు లేదు. ఆఖరుగా ‘బిడ్డా! నువ్వు ఈ చివరి క్షణాల్లో నా దగ్గర ఉంటావని అనుకోలేదు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి,’ అంటూ చెక్కిలి మీద నుంచి కన్నీరు జారుతుండగా కన్నుమూశాడు. ఆ దృశ్యం చూసిన యువకుడికి దుఃఖం ఆగలేదు. కన్నీటిని అదిమిపెట్టుకుంటూ బయటకు వెళ్లి కూర్చున్నాడు. కాసేపటికి అతని దగ్గరికి నర్సు కంగారుగా రావడం కనిపించింది. ‘ఆ ముసలాయన కుటుంబమంతా ఇప్పుడే వచ్చింది. నిన్న రాత్రి వాళ్లు రాలేకపోయారంట. వాళ్లలో ఒకతను ఆయన చిన్నకొడుకునని అంటున్నాడు. మరి మీరెవరు?’ అని అడిగింది.
‘నిజానికి ఆ ముసలాయన ఎవరో నాకు తెలియనే తెలియదు. కానీ చివరిక్షణంలో ఆయన దగ్గర ఎవరూ లేకపోవడం మాత్రం బాధ కలిగించింది. జీవితంలో ఎంత సాధించినా ఆఖరు క్షణాన ఒంటరిగా మిగిలిపోవడం నిజంగా నరకం. అందుకనే మీరు నన్ను పిలిచినప్పుడు మారుమాటాడకుండా లోపలకి వచ్చేశాను. మంచం మీద ఉన్న ఆ మనిషికి కావల్సింది తనవారు పక్కనే ఉన్నారన్న ధైర్యం, వారి స్పర్శలో ఉండే స్థైర్యం... అని అర్థమైంది. మరేం ఆలోచించకుండా ఆయనకి నా చేతిని అందించాను. జీవితపు చివరి క్షణంలో కావల్సిన తృప్తిని ఇచ్చాను’ అంటూ సంజాయిషీగా చెప్పుకొచ్చాడు.
..Nirjara