డబ్బే ప్రామాణికం అంటున్నారా?

డబ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్దలు. అదే నిత్యసత్యం కూడా. మనిషి ఆలోచనలు ఎప్పుడూ డబ్బు వెంట తిరుగుతూ ఉంటాయి. ఈకాలంలో పెద్దల తీరు ఎలా ఉంటోంది అంటే పిల్లలకు ఇంకా మాటలు కూడా రాకముందే డబ్బు గురించి ఎన్నో విషయాలు ప్రవర్తనల ద్వారా నేర్పిస్తున్నారు. పిల్లలు కూడా డబ్బును బట్టి స్పందిస్తారు.

నిజానికి ఎంతటి సంపదనైనా మనిషి పరిమితంగానే అనుభవించగలడు. ఆ విషయం తెలియకుండా మనం ప్రతి నిమిషాన్నీ పైకంతోనే ముడేస్తున్నాం. ముఖ్యంగా మారుతున్న సమాజంలో వ్యక్తి విలువను బేరీజు వేసేందుకు అతని సిరిసంపదలనే ప్రామాణికంగా తీసుకోవడం అలవాటుగా మారింది అందరికీ. అందుకే ప్రతి ఒక్కరూ ఆస్తిపాస్తుల పెంపకంలో పోటీ పడుతున్నారు.ఇది సహజమే అన్నట్టుగా ఉంటారు అందరూ… కానీ ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి! ప్రాణం లేని నోట్ల కట్టలు, నిలువెత్తు సజీవమూర్తి అయిన మనిషి విలువను వెలకడుతున్నాయంటే ఎంత ఆశ్చర్యకరమో అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి!

ఈ ప్రపంచంలో మనిషిని ఎప్పుడైనా ఎక్కడైనా పరిగాణలోకి తీసుకుని గౌరవించాలి అంటే ముఖ్యంగా చూడాల్సింది ఆ వ్యక్తిలో ప్రవర్తన, నైతిక విలువలు, మంచితనం, హుందాతనం ఇతరులకు మేలు చేసే గుణం మొదలైనవి.  కానీ ప్రస్తుతం అందరూ వాటన్నిటినీ పక్కనపెట్టి కేవలం మనిషి దగ్గర డబ్బు ఉంటే చాలు అతడే గొప్ప వ్యక్తి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. డబ్బుతో మనిషి తెచ్చిపెట్టుకున్న స్థాయిని విలువగా భావించి అతనే గొప్పవాడనే కితాబు ఇస్తున్నారు. ఇదంతా కూడా ఆ మనిషి దగ్గర డబ్బు ఉన్నంత వరకే.. అనే విషయం వారికి తెలియకపోయినా వారిని గౌరవిస్తున్నవారికి మాత్రం కచ్చితంగా తెలుసు. అంటే డబ్బున్నవాడు గొప్ప, అదే వ్యక్తి దగ్గర డబ్బు లేకపోతే అతని గొప్పతనం కనుమరుగైపోతుంది.  డబ్బెంత అశాశ్వతమో, ఆ డబ్బు ద్వారా వచ్చే పేరు, పొగడ్తలు, ఇతర పలుకుబడి కూడా  అంతే అశాశ్వతం.

పైగా ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. అనుకోకుండా వచ్చిపడే డబ్బును నడమంత్రపు సిరి అని అంటారు. ఈ  నడమంత్రపు సిరి మనషులను నేలపై నిలబడనివ్వని అహంకారాన్ని తెచ్చిపెడుతుంది. కన్నూ మిన్నూ కనబడకుండా ప్రవర్తించేలా చేస్తుంది. అలాంటి డబ్బు మనుషులకు  భవిష్యత్తులో దారిద్ర్యమే గుణపాఠం నేర్పుతుంది. 

ఆదిశంకరాచార్యులు డబ్బు గురించి చెబుతూ పంచితేనే పరమసంతోషం అని అంటారు..

అంటే డబ్బును పంచేయమని ఈయన ఉద్దేశ్యం కాదు. గృహస్థుగా ధనార్జనను విస్మరించమని కూడా శంకరాచార్యులు చెప్పలేదు. కానీ ఆ వైభోగాల పట్ల వ్యామోహాన్ని వదులుకోమని అంటున్నారు.  యవ్వనం దాటగానే మనిషికి డబ్బు వేట మొదలవుతుంది. మధ్యవయసు దాటి వార్ధక్యం లోకి అడుగుపెడుతున్న క్షణం నుంచి ఆ సంపదలపై వ్యామోహాన్ని తగ్గించుకోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. ఆ వయసులో వీలున్ కలిగినప్పుడల్లా మనస్ఫూర్తిగా నలుగురికీ దానధర్మాలు చేయాలి. మనిషిని అతలాకుతలం చేసే ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండాలి. 

భగవాన్ శ్రీరామకృష్ణులు “ధనవంతుడు దానం చేయాలి. పిసినారుల డబ్బు హరించుకుపోతుంది. దానం చేసేవాడి ధనం సంరక్షింపబడుతుంది. సత్కార్యాలకు వినియోగింపబడుతుంది. దానధర్మాలు చేసేవాడు ఎంతో ఫలాన్ని ప్రాప్తించుకుంటాడు. నాలుగు పురుషార్థాలనూ సాధించుకుంటాడు" అని అంటారు.

వీటిని బట్టి చూస్తే డబ్బు అనేది మనిషికి ఎంత అవసరమో.. మనిషి తనదగ్గర అదనంగా ఉన్న డబ్బుకు దూరంగా ఉండటం అనేది కూడా అంతే అవసరం. 

                              ◆నిశ్శబ్ద.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News