గాంధీ చనిపోయారని ఎవరన్నారు!

జనవరి 30. ఒక ఉన్మాది తూటాలకు గాంధీ బలైపోయిన రోజు. బ్రిటిష్ సామ్రాజ్యం మీద తిరుగులేని పోరుని సాగించి స్వాతంత్ర్యం సిద్ధించేదాకా నిద్రించని వీరుడు మరణించిన రోజు. గాంధీ చనిపోయి ఇప్పటికీ దాదాపు 80 సంవత్సరాలు కావస్తోంది. కానీ ఆయన జీవితాన్ని ఒక అద్భుతంగా భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. కరెన్సీ నోట్ల మీద కాకుండా వెలకట్టలేని వ్యక్తిత్వాల మీద ఆయన శాశ్వత ముద్ర ఉండాలని ఆశించేవారున్నారు. ఎందుకంటే...

 

నిరంతర ఆత్మపరిశీలన
మనలో తప్పొప్పులను పరిశీలించుకోకపోతే మార్పు అసాధ్యం. అందుకోసం అహాన్ని పక్కనపెట్టాలి. మనసుని చిత్రీ పట్టాలి. నిష్కర్షగా మనలోని లోటుని మనమే ఎత్తిచూపుకొని, దాన్ని అణచివేయాలి. గాంధి జీవితమంతా ఈ తీరునే గడిచింది. ఎప్పటికప్పుడు తను అనుకున్న విలువల ప్రకారం వ్యక్తిత్వాన్ని మలచుకోవడం వల్లే... ఆయన మహాత్ముడయ్యాడు.

 

మార్పు మనలోనే మొదలవ్వాలి
తాను ఆచరించని ఏ విషయాన్నీ గాంధీ ఇతరులకు బోధించలేదు. అహింస, ప్రకృతి వైద్యం, ఖద్దరు ధారణ, నిరాడంబరత.... ఇలా గాంధీ జీవితమే ఓ బోధగా కనిపిస్తుంది. వ్యక్తి సమాజంలోని అంతర్భాగమే అనీ, ఒకో వ్యక్తీ మారుతున్న కొద్దీ సమాజంలో కూడా మార్పు వస్తుందని నమ్మినవాడు బాపూజీ. ఈ సమాజం బాగుపడదు అని పెదవి విరిచేవారికి ఆయన సాధించిన మార్పే ఒక గుణపాఠం.

 

అహింస
ప్రతి పోరాటానికీ రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి హింసతో కూడుకున్నదైతే రెండోది అహింస! పైకి చూసేందుకు హింస సహజసిద్ధమైందిగానూ వీరత్వంగానూ కనిపించవచ్చు. కానీ అహింసతో కూడుకున్న తిరుగుబాటు అత్యంత కష్టమైన పని. రక్తం చిందించకుండానే శాశ్వతమైన పరిష్కారాన్ని అందించేది అహింసామార్గమే. ఇందులో ఇరు వర్గాలవారూ విజేతలే! అందుకే అమెరికన్ పౌరహక్కుల ఉద్యమం నుంచి ఈనాటి గాంధీగిరి వరకూ అనేక ఉద్యమ రూపాలకు ప్రేరణగా నిలిచింది.

 

పట్టుదల
పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు.. అంటూ మనకి వేమన పద్యం ఉంది. ఈ సూత్రం గాంధీగారికి సరిగ్గా అన్వయిస్తుంది. ఇతరులు ఎంతగా వ్యతిరేకించినా, విమర్శించినా సరే తను సరైనది అనుకున్న లక్ష్యానికి కట్టుబడి ఉండేవారు. వేరొకరి మెప్పు కోసం తన విలువలని ఏమాత్రమూ వదులుకోలేదు. లండన్ రాజమందిరంలోకి అడుగుపెట్టాల్సి వచ్చినా గోచిపాతతోనే ఉన్నారు.

 

మానసిక దృఢత్వం
క్విట్‌ ఇండియా పిలుపుని ఇచ్చేనాటికి గాంధీ వయసు 73 ఏళ్లు. సగటు భారతీయుడు కృష్ణారామా అనుకుంటూ తన నిష్క్రమణ కోసం వేచి చూస్తుండే వయసది. కానీ గాంధీ తన ఆఖరి ఘడియల వరకూ అనుకున్న లక్ష్యం కోసం పోరాడుతూనే ఉన్నారు. శరీరం ఎంత దుర్బలంగా ఉన్నా మనసుతో మనుగడ సాగిస్తూనే ఉన్నారు. శారీరిక వైకల్యం చేతనో, వయసు మీద పడుతోందనో, బలవంతుడిని కాదనో... పోరాటస్ఫూర్తిని కోల్పోయే ప్రతి ఒక్కరికీ గాంధి పటాన్ని చూసి తనని తాను చూసుకుంటే చాలు... మనసు దృఢంగా ఉండాలే కానీ, సాధించలేనిది ఏదీ లేదని తేలిపోతుంది. 

 

- నిర్జర.