మోడీని బాగానే దువ్వుతున్నారు
posted on May 9, 2015 9:57PM

ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోడీ తల చాలా నీట్‌గా కనిపిస్తోంది. ఆయన తన తలను బాగా దువ్వుకుంటూ వుండొచ్చు. ఒకవేళ మోడీ దువ్వుకోకపోయినా, ఆయనను దువ్వేవారు చాలా ఎక్కువైపోయారు. మోడీని దువ్వడానికి రాజకీయ నాయకులు క్యూలు కడుతున్నారు. ఎదుకంటే ప్రస్తుతం ఆయన హవా నడుస్తోంది. ఇంకా నాలుగేళ్ళపాటు ఆయన హవా ఇలాగే ఖాయంగా నడుస్తుంది. ఆయన్ని మంచి చేసుకునే ప్రయత్నంలో చాలామంది ఆయన్ని బాగా దువ్వుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడీ గారిని దువ్వేపనిలో నిమగ్నమై వుంటారు. ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడి పరిస్థితి అలాంటిది. విభజన కారణంగా దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ని గట్టెక్కించాలంటే మోడీని దువ్వాలి... కేంద్రంలో అధికారం చెలాయించే ఎవర్నయినా దువ్వాలి. ఇప్పుడు ఈ దువ్వే విషయంలో చంద్రబాబుతో పోటీ పడేవారు ఇప్పుడు కొత్తగా మరికొందరు బయల్దేరారు. వారెవరో కాదు. తెలంగాణలో అధికారంలో వున్న టీఆర్ఎస్ నాయకులు.
మొన్నటి వరకు మోడీ, గీడీ అని పుల్లను తీసి పారేసినట్టు నిర్లక్ష్యంగా మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అప్పట్లో మోడీ బ్రెయిన్ ఛైల్డ్ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని కూడా ఎంతమాత్రం పట్టించుకోలేదు. అయితే మెల్లమెల్లగా ఆయనకు అసలు విషయం బోధపడింది. ప్రధాని మోడీతో మంచిగా వుండకపోతే సీన్ సీతారైపోతుందని అర్థమైంది. దాంతో అప్పటి నుంచి మోడీతో రాసుకు పూసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ప్రధానితో ముఖ్యమంత్రుల మీటింగ్‌కి వెళ్ళి గ్రూఫ్ ఫొటోలో మోడీ పక్కనే నిల్చుని ఫొటో దిగి తాను మోడీకి చాలా క్లోజ్ అన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు. లేటెస్ట్‌గా స్వచ్ఛ భారత్ అడుగు జాడల్లో నడుస్తూ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేశారు. తండ్రి కేసీఆర్ మోడీ పక్కన నిల్చుని ఫొటో దిగి మురిసిపోతే ఆయన కుమార్తె, ఎంపీ కవిత గారు మాత్రం మోడీతో కలసి సెల్ఫీ దిగే ముచ్చటని తీర్చుకున్నారు. ఇవన్నీ మోడీని దువ్వే ప్రయత్నాల్లో భాగమేనని ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం వున్నవారికైనా తెలిసే విషయాలు. అయితే అవసరం తీరిన తర్వాత మోడీని బోడి అనకుండా వుండే విజ్ఞత వుందని ఆశించడం దురాశేనేమో.