సీఐని బూతులు తిట్టి.. కేసులు పెట్టేస‌రికి దారికొచ్చి.. ఎమ్మెల్సీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే

స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌కు ఫోన్ చేసి.. అరేయ్‌, ఒరేయ్ అంటూ అరిచాడు.. బూతులు తిడుతూ బెదిరించాడు.. నీ సంగ‌తి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు.. ఆ ఆడియో ఫుల్ వైర‌ల్ కావ‌డంతో తీవ్ర క‌ల‌క‌లం చెల‌రేగింది. సీఐపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి బూతు పురాణంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అధికార పార్టీకి తొత్తుగా వ్య‌వ‌హ‌రించే పోలీసులు.. విష‌యం ముద‌ర‌డంతో ఎమ్మెల్సీ ప‌ట్నంపై 353, 504, 506 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దీంతో.. దెబ్బ‌కు దిగొచ్చారు మ‌హేంద‌ర్‌రెడ్డి. 

ఛ‌..ఛ‌.. నేన‌లా తిట్ట‌లే. నాకు పోలీసులంటే గౌర‌వం. సీఐకి ఫోన్ చేసిన మాట వాస్త‌వ‌మే కానీ.. ఆ వాయిస్ నాది కాదు. విష‌యం కోర్టులో తేల్చుకుంటా.. అంటూ మీడియా ముందుకొచ్చి వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ప‌నిలో ప‌నిగా.. సొంత‌పార్టీలోనే ఉన్న త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డినే ఇదంతా చేస్తున్నారంటూ టాపిక్ అటువైపు డైవ‌ర్ట్ చేశారు. ఈసారి కూడా టీఆర్ఎస్ టికెట్ త‌న‌కేనంటూ స‌వాల్ విసిరారు. చాలాకాలంగా తాండూరులో ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎమ్మెల్సీ ఎపిసోడ్‌పై మ‌ళ్లీ అగ్గి రాజుకుంది. 

మ‌రోవైపు.. ఎమ్మెల్సీ ప‌ట్నం మహేందర్‌రెడ్డి త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేందర్‌రెడ్డి మనసులో ఏదో పెట్టుకుని గొడవలు చేస్తే దానికి తాను కారణం కాదన్నారు. సీఐని దూషించలేదన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తాన‌న్నారు. మహేందర్‌రెడ్డి వివాదంపై ఇప్పటి వరకు అధిష్ఠానానికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని.. అయితే తప్పకుండా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే టికెట్‌ తనదేనంటూ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డికి రివ‌ర్స్ కౌంట‌ర్ ఇచ్చారు రోహిత్‌రెడ్డి.