ఏం సాధించారని మళ్లీ గెలుపు?.. జగన్ ఎప్పుడో జీరో!
posted on Apr 28, 2022 5:34PM
175కి 175 స్థానాలో విజయం అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. ఏం సాధించారని మళ్లీ గెలుస్తారని అన్నారు. తెలుగుదేశం సబ్యత్వ నమోదుపై గురువారం పార్టీ ముఖ్య నేతలు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ చార్జీలతో ఆన్ లైన్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం ఆందోళనలకు లభిస్తున్న ప్రజాదరణతో జగన్ బెంబేలెత్తిపోతున్నారనీ, తనలోని ఓటమి భయాన్ని కప్పిపుచ్చుకునేందుకే 175 స్థానాలలో విజయం అంటూ అసంబద్ధ వ్యాఖ్యలుచేస్తున్నారని విమర్శించారు.
అన్ని విధాలుగా భ్రష్టు పట్టిపోయిన జగన్ సర్కార్ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్న చంద్రబాబు.. ఈ సారి జగన్ పార్టీ సింగిల్ డిజిట్ కు పరిమితం కావడం ఖాయమన్నారు.
అయినా జగన్ ను మళ్లీ ఎందుకు గెలిపిస్తారు... పన్నులతో ప్రజలను బాధినందుకా...ఇరిగేషన్, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసినందుకా, పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్టులను బలిచేసినందుకా అని ప్రశ్నించారు. ఆసుపత్రులలో మృతదేహాల తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వలేని ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవాలని ప్రజలు ఎందుకు అనుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. గ్రామ స్థాయిలో వైసిపి వైఫల్యాలతో పాటు, దోపిడీని కూడా ఎండగట్టాలని చంద్రబాబు ఈ సందర్భంగా క్యాడర్ కు పిలుపునిచ్చారు.