బాబు కానీ, జడ్జీలు కానీ జగన్ వెంట్రుక కూడా కదపలేరు: వైసిపి ఎమ్మెల్సీ సెన్సేషనల్ కామెంట్స్
posted on Aug 6, 2020 12:11PM
కొద్ది రోజుల క్రితం కొత్తగా గవర్నర్ చేత ఎమ్మెల్సీగా నియమించబడ్డ వైసీపీ నేత పండుల రవీంద్రబాబు ప్రతిపక్షనేత చంద్రబాబు, కోర్టుల జడ్జిల పై పరుష వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తూ వైసిపి నాయకులు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గుడ్డివానిచింత వద్ద జగన్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. పండుల తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికయిన సందర్భంగానూ ఈ కార్యక్రమం ఏర్పాటయింది. ఈ సందర్భంగా ఆయన కోర్టులు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "న్యాయస్థానాలు గానీ, జడ్జీలుగానీ, చంద్రబాబుగానీ, కేసులుగానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంట్రుకని కూడా కదపలేవు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాజధాని రైతుల శాపం కారణముగా చంద్రబాబు ఘోర పరాజయంపాలు అయ్యారని అయన ఆరోపించారు. అసలు రాజధాని రైతులకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్నవారంతా రైతులు కాదని, వారి ముసుగులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులని రవీంద్రబాబు ఆరోపించారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని సీఎం ప్రకటించడం వెనుక ఎవరికీ ఎటువంటి స్వార్థ రాజకీయ లాభాపేక్షా లేదన్నారు. గతంలో విశాఖ నుంచి పోటీ చేసిన జగన్ తల్లి విజయలక్ష్మి ఓడిపోయినా.. అదే విశాఖ నుండి ఎమ్మెల్యేలుగా టీడీపీకి చెందిన ముగ్గురు ఎన్నిక అయినా సీఎం జగన్ రాజకీయ స్వార్థం లేకుండా విశాఖపట్నంను రాజధానిగా ఎంపిక చేశారన్నారు. అదే సీఎం రాజకీయ స్వలాభం చూసుకొంటే "కడప లేక పులివెందులలోనే రాజధానిని పెట్టేవారు’’అని రవీంద్రబాబు పేర్కొన్నారు.