ఏపీ ప్రభుత్వానికి మరో దెబ్బ.. వైసీపీ ఎంపీ కి కేంద్రం వై కేటగిరి భద్రత..!

కొద్ది రోజులుగా వైసీపీకి కంట్లో నలుసులాగా తయారైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించింది. కొద్దీ రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ప్రాణాలకు ముప్పు ఉందంటూ రఘురామ రాజు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా దీని కోసం అయన కేంద్ర హోమ్ సెక్రటరీని కలవటంతో పాటుగా ఢిల్లీ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన ఈ రోజు విచారణ జరగనుంది. ఐతే దీని పైన తర్జన భర్జనల తరువాత కేంద్ర హోం శాఖ ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఈ రోజు కోర్టుకు నివేదించనుందని తెలుస్తోంది. 

 

ఐతే రఘురామరాజు కోరినట్లుగా కేంద్రం రక్షణ కల్పించటం ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు సవాల్ గా మారుతోంది. గడచినా కొద్దీ నెలలో ఇలా జరగడం ఇది రెండో సారి. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ సైతం రాష్ట్రంలో తనకు భద్రత లేదంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసారు. ఆ సమయంలోనూ ఆయనకు భద్రత కల్పించేందుకు కేంద్ర హోం శాఖ సూచనలు చేసింది. ఇది ఇలా ఉండగా పార్టీ పరంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఇరకాటంలో పెట్టే విధంగా అనేక అంశాల పైన రఘురామరాజు బహిరంగ లేఖలు రాస్తున్నా ఆయన పైన ఇప్పటివరకు ఎటువంటి క్రమశిక్షణా చర్యలు కూడా వైసిపి తీసుకోలేకపోయింది.