ఆ గాయానికి 75ఏండ్లు
posted on Aug 6, 2020 1:36PM

విధ్వంసానికి కేరాఫ్
క్షణాల్లో లక్షలాది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయిన దుర్ఘటన..
శత్రువును సైతం గుండెదడకు గురిచేసిన విస్పోటనం..
రెప్పపాటు కాలంలో శవాల గుట్టలు..
శిథిలాల మధ్య జీవం మొలకెత్తడానికి పట్టిన కాలం రెండేళ్లు..
హిరోషిమా .. అణుబాంబు విధ్వంసానికి చిరునామా. సరిగ్గా 75 ఏండ్ల కిందట ఇదే రోజు... ఇక్కడే... ఆకాశం నుంచి అగ్రరాజ్య విమాన ద్వారా జారవిడిచిన అణుబాంబు సృష్టించిన విస్పోటనం ఒక నగరాన్ని శిథిలంగా మార్చింది. ప్రజలతో నిండిన పట్టణం శవాలతో శిథిలంగా మారింది. కనీసం గడ్డికూడా మొలవదని అందరూ భావించిన ఈ చోట రెండేళ్ల తర్వాత బూడిద కుప్పల్లో నుంచి వచ్చిన మొలకలు మనిషిలోని ఆశను బతికించాయి. అణుబాంబు కారణంగా విషతుల్యమైన ఆ ప్రాంతంలో రేడియేషన్ తాలుకా దుష్పరిణామాలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. 6 ఆగష్టు, 1945 లో జరిగిన ఈ సంఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం సంస్మరణ దినోత్సవాన్ని జపాన్ ప్రజలు జరుపుకోంటారు. ఈ రోజును హిరోషిమా డే గా ప్రపంచమంతా అణువిధ్యంస చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ అణ్వస్త్ర వ్యతిరేక దినం (యాంటీ న్యూక్లియర్ డే)గా ప్రకటించారు.