పేర్ని నాని పంచ్ లు... బాబు, లోకేష్, పవన్, సుజనాపై నిప్పులు...

 

చంద్రబాబు, లోకేష్ అండ్ పవన్ పై మంత్రి పేర్ని నాని పంచ్ లు పేల్చారు. యూటర్న్ చంద్రబాబు.... మరోసారి యూటర్న్ తీసుకున్నారని సెటైర్లు వేశారు. నిన్నటివరకు ఇంగ్లీష్ మీడియం వద్దన్న చంద్రబాబు.... ఇప్పుడు తామే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక, చంద్రబాబు సొంత పుత్రుడు నారా లోకేష్‌.... దత్త పుత్రుడు పవన్ కల్యాణ్‌.... కూడా మాట మార్చడం అలవాటైపోయిందని పేర్నినాని నిప్పులు చెరిగారు. ఇంగ్లీష్ మీడియం అమలుకు తాము ప్రయత్నిస్తే ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ అడ్డుకున్నారని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. ఇప్పటివరకు ఇంగ్లీష్ మీడియం వద్దే వద్దన్న బాబు.... ఇప్పుడు ఆంగ్ల మాధ్యమానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తెలుగు కూడా ఉండాలనడం యూటర్నే అన్నారు పేర్ని నాని. ఇంగ్లీష్ మీడియంతోపాటు తెలుగు అలాగే ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టులు ఉంటాయని తాము మొదట్నుంచి చెబుతున్నామని అన్నారు. 

అయితే, జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.... మతం పేరుతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ మత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు కంటే... బీజేపీ, శివసేన, ఎంఐఎమ్మే బెటర్ అన్నారు. కనీసం వాళ్లు... తాము తమతమ మతాల కోసం పనిచేస్తామని డైరెక్టుగా చెబుతారని, కానీ తెలుగుదేశం సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ మత రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.

ఇక, బీజేపీ నేత సుజనాచౌదరిపై మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. సుజనాచౌదరి... చంద్రబాబు ఏజెంటన్న పేర్ని నాని... ఇది బీజేపీ వాళ్లకు ఎప్పుడు అర్ధమవుతుందో ఆ దేవుడికే తెలియాలన్నారు. సుజనాచౌదరి రోజూ చంద్రబాబుతో మాట్లాడకపోతే.... కాల్‌ డేటాను మీడియా ఇవ్వాలని పేర్ని నాని సవాలు చేశారు. ఇక, ఎప్పటిలాగే సుజనా... ఒక బ్యాంకుల దొంగ, మోసగాడు అంటూ పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు.