నారాయణా! వారానికోసారి సింగపూర్ వెళ్లివస్తారుట!

 

రాజధాని అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇస్తున్న సింగపూర్ ప్రభుత్వానికి అవసరమయిన సహాయసహకారాలు అందించేందుకు మునిసిపల్ మంత్రి నారాయణ నలుగురు అధికారులతో కలిసి ప్రతీ ఆదివారం సింగపూర్ వెళ్లి వస్తానని ప్రకటించారు. రాజధానికి మైక్రో లెవెల్ ప్లానింగ్ సిద్ధమయ్యే వరకు తాను పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి గిరిధర్, సి.ఆర్.డి.ఏ. కమీషనర్ శ్రీకాంత్, సి.ఆర్.డి.ఏ.కి చెందిన మరో ఇద్దరు అధికారులు ప్రతీ ఆదివారం సింగపూర్ వెళ్లి వస్తామని మంత్రి నారాయణ మీడియాకు తెలియజేసారు.

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకువచ్చేందుకు సింగపూర్, జపాన్ దేశాలు పర్యటిస్తేనే ఆయన ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చుపెట్టేస్తున్నారంటూ నానాయాగీ చేసిన వైకాపా మంత్రిగారి బృందం వారం వారం సింగపూర్ యాత్రల గురించి ఏవిధంగా స్పందిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సింగపూర్ ప్రభుత్వం రాజధానికి మాస్టర్ ప్లాన్ అందజేసే బాధ్యతలు తీసుకొన్నప్పుడు, అవసరమయినప్పుడు వారే క్షేత్ర స్థాయిలో పర్యటించి అవసరమయిన వివరాలు సేకరిస్తే సమంజసంగా ఉంటుంది గానీ ఈవిధంగా మంత్రిగారు తన బృందాన్ని వెంటబెట్టుకొని సింగపూర్ బయలుదేరుతానని చెప్పడం విమర్శలకు తావిచ్చేదిగా ఉంది.