మెగా సర్ప్రైజ్.. 'గేమ్ ఛేంజర్' అప్డేట్ వచ్చేసింది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). ఈ మూవీ షూటింగ్ ఎంత బ్యాలెన్స్ ఉంది? సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? వంటి అప్డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు డైరెక్టర్ శంకర్ 'గేమ్ ఛేంజర్' గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

శంకర్ డైరెక్ట్ చేసిన 'ఇండియన్ 2' మూవీ జులైలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్.. తన తదుపరి చిత్రం 'గేమ్ ఛేంజర్' అప్డేట్ ఇచ్చారు. "ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇంకా పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. 'ఇండియన్ 2' రిలీజ్ కాగానే.. 'గేమ్ ఛేంజర్' బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాం. సాధ్యమైనంత త్వరగా సినిమాని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను." అన్నారు.

'గేమ్ ఛేంజర్' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు.. శంకర్ చేసిన తాజా కామెంట్స్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి అనడంలో సందేహం లేదు. కాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ త్వరగా పూర్తయితే అక్టోబర్ చివరిలో లేదంటే డిసెంబర్ చివరిలో 'గేమ్ ఛేంజర్' విడుదలయ్యే అవకాశముందని సమాచారం.