ఓ సరికొత్త సంచలనం – మెడిటేరియన్ డైట్
posted on Dec 21, 2018 10:35AM
ఒక ప్రాంత ప్రజలు తినే ఆహారం వాళ్లు నివసించే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుందన్న విషయం తెలిసిందే! కానీ ఏదో అవసరం కొద్దీ అలవాటు చేసుకున్న ఆ ఆహారమే ఒకోసారి వారి ఆరోగ్య రహస్యంగా మారుతుంది. ఇతరులు కూడా ఏరికోరి మరీ అదే తరహా ఆహారాన్ని స్వీకరించే పరిస్థితి తీసుకువస్తుంది. అలా ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఆహారపు అలవాటే Mediterranean diet.
ఇదే మెడిటేరియన్ డైట్:
మధ్యధరా సముద్రం (Mediterranean sea) తీర ప్రాంతాలలో నివసించే ప్రజల ఆహారాన్నే మెడిటేరియన్ డైట్ అంటారు. మరీ ముఖ్యంగా గ్రీస్, ఇటలీ, స్పెయిన్లలో ఈ తరహా ఆహారం కనిపిస్తుంది. పప్పు దినుసులు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పెద్దగా పొట్టు తీయని తృణధాన్యాలతో కూడిన ఆహారం మెడిటేరియన్ డైట్లో ప్రముఖంగా ఉంటుంది. వీటికి తోడు వంటలో ఆలివ్ నూనె వాడకం అధికం. సముద్రం పక్కనే ఉంటారు కాబట్టి వీరి ఆహారంలో చేపలదీ ముఖ్య పాత్రే! అయితే చేపలు కాకుండా మిగతా మాంసాహారాన్ని మాత్రం వీరు చాలా తక్కువగా తీసుకుంటారు. ఇక పాలపదార్థాలు, వైన్లనేమో మితంగా పుచ్చుకుంటారు.
సరికొత్త ఫ్యాషన్:
మెడిటేరియన్ డైట్ ఎన్నో ఏళ్లుగా ఆచరణలో ఉన్నా, అందులోని ఆరోగ్యాన్ని గమనించి దానిని మిగతా ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నాలు మాత్రం ఇటీవలే జరుగుతున్నాయి. 1990ల నాటికి ఈ తరహా ఆహారం మీద అనేక అధ్యయనాలు మొదలవడంతో పాశ్చాత్య ప్రపంచం యావత్తూ దీనిని పాటించే ప్రయత్నం చేస్తోంది. తక్కువ కార్బోహైడ్రేట్లని కలిగి ఉంటూనే ఎక్కువ ప్రొటీన్లని అందించడం మెడిటేరియన్ డైట్లోని ప్రత్యేకత. ఈ ఆహారంలో గ్లైకోమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఒంట్లోకి చక్కెర ఒక్కసారిగా విడుదల కాకుండా నిదానంగా విడుదల అవుతుందన్నమాట.
అన్ని పరిశోధనలూ అటువైపే
మెడిటేరియన్ డైట్లో ఉండే ఆలివ్ ఆయిల్, పాలిష్ పట్టని తృణధాన్యాలు, చేపలు, పండ్లు... వంటి పదార్థాలన్నీ కూడా సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయని తేలింది. వీటిలోని మోనోశాటురేటెడ్ కొవ్వు, పీచు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఒంట్లో హానికారక కొవ్వు పేరుకోదు. దీంతో రక్తపోటు, గుండె ధమనులు మూసుకుపోవడం వంటి సమస్యలు దరిచేరవు. ఇక మెడిటేరియన్ డైట్ వల్ల చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుందని ఓ పరిశోధన తేల్చింది. 2008లో జరిగిన మరో పరిశోధనలో మెడిటేరియన్ డైట్ తీసుకునేవారు క్యాన్సర్తో మరణించే అవకాశం 6 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది. గత వారమే విడుదలైన ఒక పరిశోధనా ఫలితంలో ఈ తరహా ఆహారాన్ని స్వీకరించేవారి మెడదు వృద్ధాప్యంలో కూడా భేషుగ్గా ఉన్నట్లు బయటపడింది.
ఇలా మెడిటేరియన్ డైట్ మీద జరుగుతున్న నానా పరిశోధనలన్నీ అందులోని ఆరోగ్య రహస్యాలను ధృవీకరిస్తూ ఉండటంతో... జనం ఆసక్తి అటువైపుగా మొగ్గుతోంది. బరువు తగ్గాలన్నా, రక్తపోటు రాకుండా ఉండాలన్నా, చక్కెర వ్యాధి అదుపులో ఉండాలన్నా... ఇలా ఏ సమస్యకైనా అటూఇటూ పరుగులెత్తకుండా మెడిటేరియన్ తరహా ఆహారాన్ని తినమని సూచిస్తున్నారు. అయినా మన పిచ్చి కానీ పాలిష్ పట్టని బియ్యం, తృణ ధాన్యాలు, ఆకు కూరలు, పండ్లు... ఇవన్నీ తీసుకుంటే మంచిదని ఒకరు పరిశోధించి మరీ చెప్పాలా. భారతీయ ఆహారంలో వాటి పాత్ర ఈనాటిది కాదు కదా!
- నిర్జర.