కంటిచూపు నుండి మధుమేహం వరకు.. 300 సమస్యలకు చెక్ పెట్టే ఆకు ఇది..!
posted on Nov 23, 2024 10:29AM
టెక్నాలజీ పెరిగాక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. శరీరం కష్టపడకుండా ఉద్యోగాలు చేసుకుంటే హాయిగా ఉండవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ దీని వల్ల జబ్బుల రాజ్యం ఉదృతమైంది. కంటి సంబంధ సమస్యలు, మధుమేహం, ఊబకాయం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఆహారంతోనే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా గ్రామాలలోనూ, పట్టణాలలోనూ విరివిగా పెరిగే మునగ చెట్ల నుండి మునక్కాయలు కాస్తాయని అందరికీ తెలుసు. వీటిని డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అయితే మునగ ఆకులను కూడా ఆహారంలో తీసుకోవచ్చు. పచ్చిగా ఉన్న ఆకులను తీసుకోలేని పక్షంలో ఎండిన మునగ ఆకులను అయినా పొడి చేసి వినియోగించవచ్చు. ఇంతకీ మునగ ఆకులలో ఉండే పోషకాలేంటి? ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది తెలుసుకుంటే..
పోషకాలు..
మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకుల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఎ తో పాటు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాల్షియంతో పాటు, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి, ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక వరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మునగ ఆకులను ఆహారంలో తీసుకుంటే300 రకాల జబ్బులకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రయోజనాలు..
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగ ఆకులు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి, శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతాయి. వీటిని ఆహారంలో చేర్చడం ద్వారా, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
మునగ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి మునగ ఆకులను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ సి కాకుండా ఇందులో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను మరింత ప్రభావవంతంగా ఉంచుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి మునగ ఆకులు చక్కని పరిష్కారం. మునగ ఆకుల్లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా మునగ ఆకులు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మునగ ఆకులలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మహిళలు తరచుగా ఐరన్, కాల్షియం లోపాన్ని ఎదుర్కొంటారు. మునగ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి, బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మునగ ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ ఎ తీసుకోవడం కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, రేచీకటి వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, వయస్సుతో వచ్చే బలహీనతలను నివారిస్తుంది.
*రూపశ్రీ.