ఈ నాలుగు పనులు చేస్తే 100ఏళ్ల ఆయుష్షు గ్యారెంటీ అంట..!
posted on Nov 26, 2024 9:30AM
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఎక్కువ కాలం బ్రతకాలంటే శరీరం దృఢంగా ఉండాలి. ఇందుకోసం మంచి పౌష్టికాహారం తీసుకోవాలని అంటుంటారు. అయితే ఆహారం వివిధ రకాలుగా ఉంటుంది. శాకాహారం, మాంసాహారం అనే వర్గాలు అందరికీ తెలిసినవే.. శరీరం బాగా దృఢంగా ఉండాలంటే మాంసాహారం బాగా తినాలని అంటుంటారు కొందరు. కానీ 114ఏళ్ల వయసున్న ఒక బామ్మ తన ఆయుష్షు వెనుక రహస్యాన్ని బయట పెడుతూ నాలుగు పనులు చేయడం వల్లే తనకు దీర్ష ఆయుష్షు లభ్యమైందని, తను వాటిని ఫాలో అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఇంతకీ అంత శక్తి వంతమైన ఆ నాలుగు పనులు ఏంటో తెలుసుకుంటే..
నవోమి వైట్ హెడ్ అనే వృద్ధురాలి వయసు అక్షరాలా 114 ఏళ్ళు. ఆమె పెన్సిల్వేనియాలో నివసిస్తుంది. అమెరికా దేశంలోకెల్లా జీవించి ఉన్న అతిపెద్ద వయస్కురాలు ఈమెనె. ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఆమె తన 114వ పుట్టినరోజును కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకుంది. 1910లో జన్మించిన ఈమె అన్నేళ్లు జీవించడం వెనుక నాలుగు రకాల కూరగాయల తో పాటు కొన్ని పనులు కూడా సహాయపడ్డాయట.
ఇంటి కూరగాయలు..
బామ్మగారు తను ఆహారంలో తినే కూరగాయలను తనే తన ఇంటి పెరట్లో పండించుకునేవారట. ప్రతి కూరగాయను తన ఇంటి వెనుక ఉన్న స్థలంలో ఒక చిన్న తోట పెంచి అందులో పండించుకునే వారట. దీని వల్ల రసాయలనాలు లేని కూరగాయలను ఆహారంలో సాధ్యమైంది. ఒక వేళ ఇంటి పెరడు లేకపోతే కనీసం మిద్దెతోట వంటివి ఏర్పాటు చేసుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని అంటున్నారు.
చెడు అలవాట్లు..
చాలామంది చెడు అలవాట్ల కింద మద్యపానం, ధూమపానం ను చెబుతుంటారు. ఇవి మనిషి ఆయుష్షును తగ్గిస్తాయి. మద్యపానం., ధూమపానానికి దూరం ఉండేవారు దీర్ఘకాలం జీవించవచ్చని అంటున్నారు.
చురుకుదనం..
శారీరకంగా చురుకుగా ఉండటం ఎంతో ముఖ్యం. ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అంత ఆయుష్షు అంటున్నారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడమే కాకుండా వీలైనన్ని పనులు సొంతంగా చేసుకోవడం వల్ల శరీరం బాగా ఫిట్ గా తయారవుతుంది. ఇది ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుంది.
ఆహారం..
శరీరానికి శక్తికి మూల వనరు ఆహారమే.. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. సొంతంగా పండించుకున్న కూరగాయలను వండుకోవాలి. ఇంటి ఆహారమే తినాలి. బయటి ఆహారం అస్సలు తినకూడదట. ముఖ్యంగా ఇప్పట్లో బాగా అమ్ముడుపోతున్న పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినకూడదని బామ్మగారు చెప్పారు. సమతుల ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
*రూపశ్రీ.