మనిషి జీవితం పరిపూర్ణత సాధించాలంటే తెలుసుకోవలసింది ఇదే..

జీవితంలో మనిషికి ఎన్నెన్నో అలవాట్లు ఉంటాయి. వాటిల్లో కొన్ని ఉపయోగకరమైతే మరికొన్ని పతనానికి దారితీస్తాయి. ఈ అలవాట్లకి కారణం అతని మానసిక ఆలోచనా ధోరణే తెలివైనవాడు తన ఆలోచనా ధోరణిని నియంత్రిస్తే, మూర్ఖుడు ఆలోచనల చేత నియంత్రింపబడతాడు. తెలివైనవాడు ముందు తను ఏం ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో నిర్ణయించుకుంటాడు. బాహ్య విషయాలు అతని ఆలోచనా ధోరణిని భంగపరచకుండా జాగ్రత్త వహిస్తాడు. కానీ తెలివి తక్కువవాడు అలా కాదు. అస్థిరమైన ఆలోచనలతో ఇతర విషయాల ప్రభావంతో తన నిర్ణయాలను క్షణం క్షణం మార్చుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తాడు.


ఆలోచనా రాహిత్యం మనిషిని ఉన్మత్తుడ్ని చేస్తుంది. మనిషి వైఫల్యానికి ప్రధాన కారణం అతని అశ్రద్ధతో కూడిన ఆలోచనా ధోరణులే సరైన, నిజమైన ఆలోచన గల మానసిక ప్రవృత్తి మాత్రమే మనిషి తప్పుడు జీవితాన్ని సరిచేయగలదు. సరైన, నిర్దుష్టమైన నడవడిక మాత్రమే మనిషి జీవితంలో శాంతిని ప్రసాదించి, సఫలీకృతుడ్ని చేయగలదు.


ఆలోచనలని నియంత్రించాలంటే ముందు మనలో గజిబిజిగా కలిగే ఆలోచనలను క్రమబద్దం చేయాలి. తార్కికతను అలవర్చుకోవాలి. ఒకదానికి మరోదానికి మధ్యన సారూప్యత, సామరస్యత ఉండాలి. పొంతన లేనట్లుండే అనంతమైన ఆలోచనా పరంపరల్ని ఓ క్రియాశీలకమైన రూపంలోకి మరల్చుకోవాలి. మన ఆచనలు మన నియమాలకు గానీ లేదా మన ధోరణికి గానీ విరుద్దంగా వుండకూడదు. మనం ఇతరుల మీద చూపించే జాలిగానీ, దయగానీ, క్షమగుణం గాని మనల్ని ఇబ్బందుల్లో పడేయగూడదు. నీతితో కూడిన నియమాలకు నీతికర వాతావరణంలో కూడా కట్టుబడి వుండాలి.


మనలో కలిగే ఆలోచనలలో, స్పందనలలో ఏవి నిజాలో, ఏవి అపోహలో తేల్చుకోవాలి. మనలోని విజ్ఞాన పరిధుల్ని కనుగొనాలి. మనకేం తెలుసో మనకి తెలియాలి. అలాగే, మనకేం తెలియదో కూడా మనకు తెలియాలి. ఏవి సత్యాలో, ఏవి అభిప్రాయాలో మనం గ్రహించాలి. చాలా మంది తమ నమ్మకాలని తమకు తెలిసిన జ్ఞానంగా భావిస్తారు, అది సమంజసం కాదు. తప్పుగా ఆలోచించే వాడి చేష్టలు కూడా దుర్మార్గంగా వుంటాయి. దానికి తగ్గట్టు సమస్యలు అవిశ్రాంతంగా వచ్చి పడుతుంటాయి. తనని ఇతరులు నాశనం చేస్తారని, మోసం చేస్తారని, తనకి కీడు తలపెడతారని ఊహిస్తుంటాడు. తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో ధర్మాన్ని పూర్తిగా విస్మరిస్తాడు. ఫలితంగా తన దుర్మార్గపు అంచనాలకు తానే బలి అవుతాడు, ఆత్మ పరిశీలన లేకపోవడం చేత దుర్మార్గానికి సన్మార్గానికి మధ్య తేడా గ్రహించలేడు.


కాని సరైన పంథాలో ఆలోచించేవాడు అలాకాదు. తన గురించి గాని, తన వ్యక్తిగత శ్రద్ధ గురించిగాని ఆలోచించడు. తనపై ఇతరులు ప్రదర్శిస్తున్న ఈర్ష్యాద్వేషాలు అతనికి మానసిక అస్తిరతను కలిగించవు. అతనెప్పుడు “ఫలానావ్యక్తి నాకు కీడు తలపెట్టాడు" అని ఆలోచించడు. కేవలం తన దుశ్చేష్టలే తనని నాశనం చేస్తాయి తప్ప ఇతరుల చేష్టలు  తననేమి చేయలేవని గ్రహిస్తాడు. తన భవిష్యత్తు, తన ఎదుగుదల కేవలం తన చేతుల్లోనే వుందని గ్రహిస్తాడు. విషయాసక్తి, విషయావగాహన వుంటుంది. యదార్థాలని యదార్థాలుగా చూస్తాడు కష్టాలు వచ్చినప్పుడు విపరీతంగా కదిలిపోడు. అలాగే ఆనందవు సమయాలలో వివరీతంగా చలించడు జీవితపు ఆటుపోట్లకు తట్టుకునే మానసిక స్థైర్యాన్ని సంతరించుకుంటాడు. తన చుట్టూ వున్న ప్రకృతినుంచీ, తన చుట్టూవున్న సమాజం నుంచీ నిరంతరమూ నేర్చుకుంటూనే వుంటాడు.


మనిషి ఎంతైనా నేర్చుకోవచ్చు కానీ, దానికి తగ్గ సమయస్ఫూర్తి ధర్మచింతన లేకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ముందు మనిషి తనని తాను జయించుకోగలిగిన నాడు ఆధర్మాన్ని జయించగలడు. కష్టాలు, బాధలు చిరాకులు ప్రతి మనిషికీ వుంటాయి. అయితే వాటిని ఓపికతో, ఓ నిర్దుష్టమైన ప్రణాళిక, వ్యూహంతో ఛేదించ గలిగిననాడు మనిషి జీవితం పరిపూర్ణతను సంతరించుకుంటుంది.


                                 ◆నిశ్శబ్ద.