మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకోవాలి?

ప్రతి మనిషీ తన జీవితంలో తన వ్యక్తిత్వం ఎలా ఉందో ఒకసారి గమనించుకుని విశ్లేషించుకుంటే  తను సరిగానే ఉన్నాడా లేదా తనని తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనే విషయం అర్థమవుతుంది. మనం చేసే ప్రతికార్యమూ, శరీరంలోని ప్రతిచలనమూ, మనం చేసే ప్రతి ఆలోచనా మనస్సులో ఒక విధమైన సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈ సంస్కారాలు పైకి మనకు కనబడకపోయినా అంతర్గతంగా ఉండి అజ్ఞాతంగా పనిచెయ్యడానికి తగినంత శక్తిమంతాలై ఉంటాయి. ఇప్పుడీ క్షణంలో ఉన్న  స్థితి ఇంతకు క్రితం  జీవితంలో ఏర్పడివున్న సంస్కారాల సాముదాయక ఫలితం. నిజంగా వ్యక్తిత్వం అంటే ఇదే. ప్రతి మానవుడి స్వభావము అతనికి ఉన్న అన్ని సంస్కారాలచే నిర్ణయించబడుతుంది. మంచి సంస్కారాలు ప్రబలంగా ఉంటే వ్యక్తిత్వం మంచిదౌతుంది. చెడు సంస్కారాలు ప్రబలంగా వుంటే స్వభావం చెడ్డదౌతుంది. 


ఒకవ్యక్తి ఎప్పుడూ చెడుమాటలను వింటూ, చెడు ఆలోచనలను చేస్తూ, చెడుపనులు చేస్తూవుంటే అతడి మనస్సు చెడు సంస్కారాలతో నిండి ఉంటుంది. అతడికి తెలియకుండానే అవి అతడి తలపులలో, చేతలలో తమ ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి ఈ చెడు సంస్కారాలు సదా పని చేస్తూంటే చెడే వాటి ఫలితమౌతుంది. చెడు సంస్కారాల మొత్తం అతనిచే చెడుపనులను చేయించడానికి బలీయ ప్రేరకమవుతున్నది. 


ఒకరి వ్యక్తిత్వాన్ని నిజంగా నిర్ణయించాలని చూస్తే అతడు చేసిన  మహత్కార్యాలను పరికించకూడదు. ప్రతి మూర్ఖుడూ ఏదో ఒకానొక సందర్భంలో వీరుడు కావచ్చు. మామూలు పనిలో నిమగ్నుడై ఉన్నప్పుడు మనిషిని గమనించాలి. ఒక గొప్ప వ్యక్తి నిజమైన వ్యక్తిత్వాన్ని అలాంటి పనులే వ్యక్తం చేస్తాయి. గొప్ప సందర్భాలు అట్టడుగు వ్యక్తిని సైతం ఏదో కొంత గొప్పదనం సంతరించుకొనేలా చేస్తాయి. కాని ఎక్కడ ఉన్నప్పటికీ సర్వదా ఎవరు గుణసంపన్నుడో అతడే నిజానికి మహోన్నతుడు. 

మన భావనలు తీర్చిదిద్దిన మేరకే మనం రూపొందుతాం కాబట్టి  భావనల విషయంలో శ్రద్ధ వహించాలి. మాటలు అప్రధానం. భావనలు సజీవాలు, అవి సుదూరాలకు పయనిస్తాయి. మన ప్రతి భావన మన స్వీయ నడవడితో మిశ్రితమై ఉంటుంది..


మంచి పనులు చేయడానికి నిరంతర దీర్ఘకాలం ప్రయత్నం అవసరం. అది ఫలించకపోయినా మనం కలత చెందకూడదు. మనం చేసే ప్రతి కార్యం  సరస్సు పైభాగంలో చలించే అల లాంటిది. ఇదంతా అభ్యాసమే.. మనం సజ్జనులుగా ఉన్నా, దుర్జనులుగా ఉన్నా అంతా అభ్యాస ఫలితమే. కాబట్టి ఒక అభ్యాసాన్ని అలవాటు చేసుకోవటం లేదా వదలిపెట్టటం మన చేతులలోనే ఉంది. అందుకని ప్రస్తుతమున్న మన స్వభావం గూర్చి మనం నిరాశ చెందనవసరం లేదు. 


ఒకవ్యక్తి ఎంత చెడ్డవాడైనాసరే, 'అతనిక మంచివాడు కాలేడు' అని చెప్పవద్దు. ఎందుకంటే, అతని ప్రస్తుత ప్రవర్తన అతను గతంలో చేసిన పనుల ఫలితం. అదే అతను కొత్తగా కొన్ని పనులు మొదలుపెట్టి మంచి మార్గంలో ప్రయాణిస్తే అతను తన వ్యక్తిత్వాన్ని మార్చుకుని మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది.  మనిషి తన వ్యక్తిత్వాన్ని అలాగే మార్చుకోవాలి.
                                     

◆నిశ్శబ్ద.

Related Segment News