చంద్రబాబుకు టాప్ ప్రయారిటీ.. అలిగిన దీదీ..నీతి ఆయోగ్ నుంచి వాకౌట్!

ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని కల్చరర్ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్   గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం  నుంచి తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు.    ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్న బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్.. ఆ సమావేశానికి రాకుండా డిప్యూటీ సీఎంలను పంపించారు. మరోవైపు.. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకుండా బహిష్కరించాయి.

అయితే ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశాలనికి హాజయర్యారు. అయితే సమావేశం మధ్యలోనే ఆమె వాకౌట్ చేశారు. వాకౌట్ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో  తనకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి మైక్ కట్ చేశారనీ ఆరోపించారు.  తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపు గురించి తాను మాట్లాడటం ప్రారంభించగానే.. తన మైక్‌ ఆఫ్ చేశారని ఆమె ఆరోపించారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పశ్చిమ బెంగాల్‌పై వివక్ష చూపారని.. రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ తాను మాట్లాడగానే తన మైక్ ఆపేసి.. మాట్లాడకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.

 సమావేశంలో పాల్గొన్న మిగతా సభ్యుల మాదిరిగానే మాట్లాడేందుకు తనకు తగిన సమయం ఇవ్వకుండా  అవమానించారనీ,  ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడేందుకు 20 నిమిషాల సమయం ఇచ్చారని.. కానీ తనకు మాత్రం కేవలం ఐదు నిముషాలు మాత్రమే సమయం ఇచ్చారనీ, ఈ వివక్షకు నిరసనగా తాను సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు మమత చెప్పారు.  భవిష్యత్తులో ఇంకెప్పుడూ తాను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానని మమత శపథం చేశారు. అయితే మమతా బెనర్జీ ఆరోపణలను   బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు బాయ్‌కాట్‌ చేసేందుకు నీతి ఆయోగ్‌ సమావేశాన్ని ఒక వేదికగా చేసుకున్నారని పేర్కొంది.