ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ!

పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదని... ఒరిజినల్ సిటీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాత బస్తీలో మెట్రో నిర్మాణం అంశం మీద  ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ‘‘పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు.. అది ఒరిజినల్ సిటీ’’ అన్నారు. పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని  ఆయన చెప్పారు. ఎస్. జైపాల్ రెడ్డి కేంద్ర అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిగా వయబుల్ గ్యాప్ ఫండ్ తీసుకువచ్చి హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ అందుబాటులోకి తీసుకురాలేదని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేశామని చెప్పారు. మెట్రో రెండో దశలో 78 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక సమర్పించామన్నారు. నాలుగేళ్లలో ఓల్డ్ సిటీ... అంటే ఒరిజినల్ సిటీలో మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.