మీ అమ్మ మాకూ అమ్మే.. మోడీకి మమత సంతాప సందేశం
posted on Dec 30, 2022 2:10PM
రాజకీయ పక్షాలు శత్రువుల్లా కాకుండా ప్రత్యర్థులుగా వ్యవహరించాలి. అయితే తెలుగు రాష్ట్రాలలో ఆ పరిస్థితి ఇసుమంతైనా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం ఉందా అన్నట్లుగా వారి విమర్శలు, వ్యాఖ్యలు ఉంటున్నాయి. వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ విమర్శలు కాదు దూషణలకు పాల్పడుతున్నారు.
కానీ రాజకీయాలకు అతీతంగా ఒక మానవీక కోణం ఉందన్నసంగతిని మరచిపోతున్నారు. మంచి జరిగినప్పుడు అభినందించడం.. ఏదైనా విషాదం జరిగినప్పుడు సానుభూతి వాక్యాలు చెప్పడం.. విజ్ణత అనిపించుకుంటుంది. అలాటి విజ్ణతను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చూపారు. తల్లిని కోల్పోయిన విషాదంలో ఉండి కూడా ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ లో హౌరా నుంచి న్యూ జల్పాయిగురి మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీకి పంపింన సంతాప సందేశంలో హృద్యంగా స్పందించారు.
తల్లి పోయిన బాధలో ఉన్నారు. అయినా పశ్చిమ బెంగాల్ కు వందే భారత్ రైలును ప్రారంభించారు. అందుకు దన్యవాదాలు అని పేర్కొన్నారు. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న మీకు ప్రగాఢ సాను భూతి. మీకు తల్లి మాకు కూడా తల్లే.. మీకు భగవంతుడు ఈ విషాదాన్ని తట్టుకునే మనో బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి అని ట్వీట్ చేశారు.
మీకు ఈ రోజు ఎంతో విచారకరమైనది. అయినప్పటికీ, ఈ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరు కావడం అదొక గౌరవం. మీ పని ద్వారా మీ అమ్మగారి పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు అని మమతా బెనర్జీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.