మాణికం ఠాకూర్ కు ఉద్వాసన

కొత్త సంవత్సరంలో తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులకు హైకమాండ్ శ్రీకారం చుట్టనుందా అన్న ప్రశ్నకు పార్టీ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభానికి కారణమైన సీనియర్, జూనియర్ల మధ్య అగాధాన్ని పూడ్చేందుకు మధ్యే మార్గంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుందని  అంటున్నారు. సీనియర్లలో అసంతృప్తి ఒకింత తగ్గించి, అదే సమయంలో  జూనియర్లను చిన్నబుచ్చకుండా పార్టీలో మార్పులు, చేర్పులూ చేసేందుకు పార్టీ హైకమాండ్ కసరత్తు చేసిందని చెబుతున్నారు.

కొత్త సంవత్సరంలో ఈ మార్పులు జరుగుతాయని చెబుతున్నారు.  ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్లకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాగూరుకు కొత్త సంవత్సరం తొలి నెలలోనే ఉద్వాసన పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ లో అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తిని నియమించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. అసలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా ఇటీవల రాష్ట్ర పార్టీలో సంక్షోభ నివారణకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ నే నియమించాలన పార్టీ హైకమాండ్ భావించినా అందుకు డిగ్గీ రాజా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మరో సమర్ద నేత కోసం అన్వేషణ మొదలైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

సీనియర్లతో పాటుగా పార్టీ మారిన నేతలు కూడా మాణికం ఠాకూర్ పై  తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, అలాగే    పార్టీలో సంక్షోభ నివారణ కోసం రాష్ట్రానికి వచ్చిన డిగ్గీ రాజా ఎదుట సీనియర్లు  ఠాగూర్‌పై ఫిర్యాదులు చేయడంతో అధిష్ఠానం  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా కొత్త వ్యక్తిని నియమించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  పార్టీలో విభేదాల పరిష్కారం విషయంలో మాణికంఠాకూర్ విఫలమయ్యారన్న అభిప్రాయం పార్టీ హైకమాండ్ లో వ్యక్తం అవుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ పై కూడా సీనియర్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయనను మార్చే విషయంలో ఏఐసీసీ సుముఖంగా లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  

ప్రస్తుతం సీనియర్ల తిరుగుబాటు నేపథ్యంలో వారిని చల్లబరిచేందుకు  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్‌ను తప్పించడమే మార్గమని పార్టీ హైకమాండ్ భావిస్తోందంటున్నారు  డిగ్గీ రాజా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించిన నేపథ్యంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకులు  రణదీప్ సుర్జేవాలా,  పీ పన్నాలాల్ పునియా పృథ్వీరాజ్ చౌహాన్​ పేర్లు హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద మాణికం ఠాకూర్ ను మార్చడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ సంక్షోభానికి తెరపడుతుందని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది.